Hyderabad: భారీ వర్షం.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2023-04-29T09:32:46+05:30 IST

సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది.

Hyderabad: భారీ వర్షం.. మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్ కళాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి అయ్యింది. భాగ్యనగరంలో ఈరోజు ఉదయం నుంచి భారీగా వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా మ్యాన్‌హోల్స్‌లో నుంచి నీరు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా... పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల కోసం వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చివరకు మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

జలమయమైన భాగ్యనగర రోడ్లు...

నగరంలో శనివారం ఉదయం భారీవర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించింది. బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నదులను తలపించాయి. జీడిమెట్ల, చింతల్, ఐడీపీఎల్, షాపూర్, సూరారం, సుచిత్ర, బాలానగర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి‌న వర్షం కురిసింది. ఈరోజు తెల్లవారుజామున భారీవర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

Updated Date - 2023-04-29T09:36:00+05:30 IST