Ayyappa: వైభవంగా అయ్యప్ప కుంభాభిషేక మహోత్సవం
ABN , First Publish Date - 2023-11-02T19:03:10+05:30 IST
హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం బుధవారం తుని తపోవన పీఠాధీశ్వరులు సద్గురు సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి ప్రారంభించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ద్వితీయ పుష్కర కుంభాభిషేక కార్యక్రమం బుధవారం తుని తపోవన పీఠాధీశ్వరులు సద్గురు సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి ప్రారంభించారు. రెండో రోజూ పూజల్లో భాగంగా గురువారం... గోపూజ, గవ్యాంత పూజలు, మార్జనం, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, పర్యగ్నికరణ, రక్షకోద్ధారణ, నిత్యోపాసన, మహా సుదర్శన హోమం, జలాధివాసం, తదంగ హోమములు వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అయ్యప్ప భక్తుల శరణఘోష నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం అయ్యప్పస్వాములకు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో సూరపనేని సునంద్ - పద్మప్రియ దంపతులు, దేవాలయ చైర్మన్ సీహెచ్ రామయ్య, ఈఓ శీమతి ఎన్. లావణ్య, అయ్యప్పస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ శ్రీనివాస్‌శర్మ, రామకృష్ణ శర్మ, దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
కార్యక్రమాల వివరాలు
నవంబర్ 3 (శుక్రవారం)
ఉదయం 9 గంటలకు గోపూజ, గవ్యాంత పూజలు, మార్జనం, అష్టోత్తర కలశస్థాపన, ‘క్షీరాధివాసం’, హోమములు, మండపారాధన, హారతి తీర్థ ప్రసాద వితరణ. ఉదయం 10.00 గంటలకు చండీహోమం, వేద పారాయణ సాయత్రం 5గంటలకు ధాన్యాధివాసం, శాంతి కుంభ స్థాపనలు, కుంభాభిషేక కలశస్థాపనలు, తదంగ హోమములు, నిత్యోపాసన, నిత్య బలిహరణ, తీర్థ ప్రసాద వితరణ. 5.00 గంటలకు భగవతీ సేవ, బ్రహ్మశ్రీ కృష్ణ నంబూద్రి (శబరిమల మాజీ మేల్‌శాంతి) వారి బృందంచే నిర్వహించబడును. 6.00 గం.లకు వీరమణిగారి బృందంచే భజన కార్యక్రమం.
నవంబర్ 4 (శనివారం)
ఉదయం 9.00 గంటలకు గోపూజ, ద్రవ్యాంగ పూజలు, మార్జనం మండప పూజలు, సుగంధ ద్రవ్యాలు, నదీ జలాలతో ‘జలాధివాసం’, హోమములు, నిత్యోపాసన, నిత్య బలిహరణ, హారతి, తీర్థ ప్రసాద వితరణ. ఉదయం 10 గంటలకు ‘శ్రీ రుద్ర సహిత మహా మృత్యుంజయ హోమం’, వేద పారాయణ. సాయంత్రం5 గంటలకు పంచ శయ్యాధివాసం, శాలాంగ దేవతా పూజ, పుష్పాధివాసం, వస్త్రాధివాసం, ఫలాధివాసం, అంగ ప్రత్యంగ శాలాంగ దేవాతాహోమం, నిత్యోపాసన, బలిహరణ, హారతి, ప్రసాద వితరణ. మధ్యాహ్నం 3.00 గంటలకు ‘శ్రీచక్ర నవావరణ పూజ’, బ్రహ్మశ్రీ మనోజ్ నంబూద్రి (శబరిమల మాజీ మేల్‌శాంతి) వారి బృందంచే నిర్వహించబడును.
నవంబర్ 5 (ఆదివారం)
ఉదయం 4.30 నిమిషాలకు మహా గణపతి హోమం, గవ్యాంత పూజలు, మార్జనం, బలిపీఠ పూజలు, ధాతు నిక్షేపణ. ఉదయం 7.27 నిమిషాలకు బలిపీఠములు, ధ్వజస్తంభం, చండీశ్వరుడు, ఆలయ శిఖర, యంత్ర ప్రతిష్ఠ. ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర కలాశాభిషేక సహిత మహా కుంభాభిషేకం, జీవన్యాసం, మహా పూర్ణాహుతి, అవబృదం. ఉదయం 11.00 గంటలకు మహాపడి పూజ, బ్రహ్మశ్రీ కంఠరారు మహేష్ మోహన్ తంత్రి (శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు) గారిచే నిర్వహించబడును. 12.30 నిమిషాలకు అన్నసమారాధన సాయత్రం 7.00 గంటలకు పల్లకి సేవ, రాత్రి 9.00 గంటలకు హారతి, హరివరాసనం, తీర్థ ప్రసాద వితరణ జరుగును.