Bachupalli Incident: బాచుపల్లి చిన్నారి ఆత్మఘోషకు అక్షర రూపం..

ABN , First Publish Date - 2023-08-02T18:31:32+05:30 IST

ఎనిమిదేళ్ల చిన్నారి. పాఠశాలలో చదువుకుంటూ పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ గడుపుతున్న పసి వయసు. ఏ పాపం చేసిందని ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పాపం చేసింది ఆ చిన్నారి కాదు. వ్యవస్థ, అధికార యంత్రాంగం. గుంతలు పడిన రోడ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్‌ఎంసీ తీరు ఆ పసి ప్రాణాన్ని చిదిమేసింది.

Bachupalli Incident: బాచుపల్లి చిన్నారి ఆత్మఘోషకు అక్షర రూపం..

‘హైదరాబాద్ నగరంలో అధ్వాన రహదారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఎన్ని వందల కోట్లు వెచ్చించినా ఎందుకీ దుస్థితి. ఈ పరిస్థితి మారాలి. సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకాలి’ పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్న మాటలు ఇవి. అయినా, అదే దుస్థితి. జీహెచ్‌ఎంసీ నిర్వహణలో ఉండే రహదారులకే ఎందుకీ దుస్థితి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. చినుకు పడితే చాలు రోడ్లన్నీ బురదమయమవుతున్నాయి. గుంతలమయంగా తయారవుతున్నాయి. ఆ గుంతలు పడిన రోడ్లు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. బాచుపల్లిలో బుధవారం నాడు జరిగిన దుర్ఘటనే ఇందుకు నిదర్శనం.

ee0cc9d0-a95d-45fc-855d-f215dba74b28.jpg

ఎనిమిదేళ్ల చిన్నారి. పాఠశాలలో చదువుకుంటూ పిల్లలతో కలిసి ఆడుతూపాడుతూ గడుపుతున్న పసి వయసు. ఏ పాపం చేసిందని ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. పాపం చేసింది ఆ చిన్నారి కాదు. వ్యవస్థ, అధికార యంత్రాంగం. గుంతలు పడిన రోడ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్‌ఎంసీ తీరు ఆ పసి ప్రాణాన్ని చిదిమేసింది. ఆ రోడ్డే సవ్యంగా ఉండి ఉంటే తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి స్కూటీ స్కిడ్ అయి ఉండేది కాదు. ఆ పాప బస్సు చక్రాల కింద పడి ఉండేది కాదు. రోజూలానే స్కూల్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండేది. సాయంత్రం ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చే తన తండ్రి కోసం ఎదురుచూస్తూ ఉండేది. కానీ.. నిర్లక్ష్యం ఆ పాప ఆశలను ఆవిరి చేసింది. కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఇలాంటి ఘటనలు జరగడం హైదరాబాద్‌ నగరంలో కొత్తేమీ కాదు. ఎన్ని ఘటనలు జరిగినా ఆ ఒకటిరెండు రోజుల హడావిడే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. ‘‘వ్యవస్థల నిర్లక్ష్యానికి నేను బలవ్వాలా’’ అని ఆ చిన్నారి ఆత్మ ఘోషిస్తోంది. ‘‘నాకు బతకాలని ఉందమ్మా’’ అని రోదిస్తోంది. ఆ తల్లిదండ్రుల కడుపుకోత ఆక్రోశంతో అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది.

19120c2f-944c-4e19-a87f-228a36d915c4.jpg

ఒక్క బాచుపల్లి ప్రాంతంలోనే కాదు.. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు, కంకర తేలుతుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నాణ్యతారహితంగా రహదారుల నిర్మించడం, అదే పనిగా మరమ్మతులు చేయడం ద్వారా జేబులు నింపుకోవడమే లక్ష్యంగా బల్దియాలోని కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు పని చేస్తున్నారు. ప్రమాదాలకు గురవుతోన్న వాహనదారులు.. అధ్వాన రహదారులపై ప్రయాణించి అనారోగ్యం బారిన పడుతున్న వాహనదారుల వెతలు అధికారులకు తెలియడం లేదు. దీనికి తోడు పైపులైన్లు, కేబుళ్ల కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో పలు చోట్ల పరిస్థితి గందరగోళంగా మారింది.


ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) మార్గదర్శకాల ప్రకారం గుంతలను శాస్ర్తీయ పద్ధతిలో పూడ్చాలి. గుంత ఏర్పడిన చోట చుట్టూ ఉన్న బీటీని క్రమానుగుణంగా తొలగించి... బీటీ ద్రావకం వేయడంతో పాటు కంకర మిక్సింగ్‌ వేసి రోలింగ్‌ చేయాలి. బీటీ మిక్సింగ్‌ ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయిలో ఉండేలా చూడాలి. కానీ జీహెచ్‌ఎంసీ బృందాలు మాత్రం గుంతల్లో కంకర, బీటీ మిక్సింగ్‌ వేసి వెళ్తున్నారు. నిర్ణీత స్థాయి ఉష్ణోగ్రతలో బీటీ లేకపోవడం, రోలింగ్‌ చేయకపోవడంతో వాహనాలతోపాటే కొట్టుకుపోతుంది. అదే సమయంలో వాన పడితే ఇక అంతా వృథానే.

వానాకాలంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పూడుస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ఐదేళ్లలో రహదారుల నిర్మాణం, నిర్వహణకు రూ.2,250 కోట్లు ఖర్చయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల ముందు రహదారుల వ్యవస్థ మెరుగుపర్చేందుకు పీరియాడిక్‌ ప్రివెంటీవ్‌ మెయింటెనెన్స్‌ (పీపీఎం) చేపట్టారు. రూ.721 కోట్లతో జీహెచ్‌ఎంసీ, మరో రూ.350 కోట్లతో హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ముందస్తు రహదారుల నిర్మాణ పనులు చేయాలని నిర్ణయించాయి. ఇందులో దాదాపు రూ.800 కోట్లకుపైగా ఖర్చు చేశారు. అయినా పరిస్థితిలో ఏ మార్పు కనిపించలేదు.

f76cc842-3d33-443e-b35f-2d081fd167aa.jpg

రోడ్ల నిర్మాణం మాత్రమే కాదు.. గుంతల పూడ్చివేతకూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో గుంతకు విస్తీర్ణాన్ని బట్టి రూ.600 నుంచి 1,500 వరకు ఖర్చవుతుందని లెక్కలేస్తూ ఇష్టానికి దండుకుంటున్నారు. మొత్తంగా ఏటా గుంతల మరమ్మతుకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో అంతర్గత రహదారుల పరిస్థితి మరీ అధ్వానం. శివారు సర్కిళ్లలో తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతుండడంతో రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. పునరుద్ధరణ పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యాకే రహదారులు తవ్వాలని మంత్రి కేటీఆర్‌ గతంలో ఆదేశించారు. వర్షాకాలానికి ముందు పునరుద్ధరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించిన జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు ఇప్పుడా విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. పైపులు వేసి నెలలు గడిచినా రహదారులను పునరుద్ధరించడం లేదు. హైదరాబాద్‌లో వర్షాకాలంలో ఇలా కొందరి నిండు ప్రాణాలను గుంతలు బలితీసుకుంటుంటే, జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తుండటంపై నగరవాసుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-08-02T18:31:51+05:30 IST