Election Code: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. భారీగా నగదు, బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2023-10-09T20:55:27+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్(Telangana Assembly Elections) జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, అనంతరం ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్(Telangana Assembly Elections) జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, అనంతరం ఎన్నికల ఫలితాలు రానున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్(Election Commissioner Rajeev Kumar) తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణలో సోమవారం నుంచి అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశాలతో తెలంగాణ పోలీస్ శాఖ(Telangana Police Department) రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా విసృత తనిఖీలు చేపడుతోంది. రూ.50 వేలకు మించి నగదుతో వెళ్తే.. అందుకు సంబంధించిన పత్రాలు, రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని తెలంగాణ పోలీను శాఖ సూచించింది. డబ్బు, ఆభరణాలు, ఎన్నికల ప్రచార సామాగ్రికి కూడా పోలీసుల రూల్స్ వర్తించనున్నాయి. గుర్తింపు పత్రాలు లేకుండా నగదు కనపడితే వెంటనే సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైవేపై వెళ్తున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు
► చందానగర్‌లోని తారానగర్‌లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేశారు.
► నిజాంక్లబ్ దగ్గర 16 కిలోల బంగారం, 20 కిలోల వెండిని సీజ్ చేశారు.
► అబిడ్స్‌లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
► ఫిలింనగర్‌లోని నారాయణమ్మ కాలేజ్ దగ్గర కారులో తరలిస్తున్న రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
► షాద్‌నగర్‌లోని రాయికల్ టోల్‌ప్లాజా దగ్గర సోదాల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.18.50 లక్షలు సీజ్ చేశారు.
► చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టగా రూ.9.30 లక్షల నగదు పట్టుబడింది.
► శంకర్‌పల్లి ఎస్‌ఓటీ పోలీసులు అత్యుత్సాహంతో రెండు కార్లల్లో తరలిస్తున్న ఓ వైద్యుడుకి చెందిన రూ.80 లక్షలు సీజ్ చేశారు. తనకున్న 1250 గజాల ప్లాటును అమ్మిన డబ్బును.. కారులో తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు.
► శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోతో ఉన్న రైస్ కుక్కర్లను పంపిణీ చేస్తున్న నాయకులని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు.
► వనస్థలిపురంలో.. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా జరిగిన వాహన తనిఖీల్లో రూ. 4 లక్షల రూపాయలను సీజ్ చేశారు.
► బషీర్ బాగ్‌లో పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండిని అబిడ్స్ పోలీసులు సీజ్ చేశారు.
► ఖమ్మం జిల్లాలో 9 లక్షల 80 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లిలో 5 లక్షలు, కల్లూరులో 4 లక్షల 80 వేల నగదును పట్టుకుని సీజ్ చేశారు. కొణిజర్ల మండల కేంద్రంలో పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలల్లో.. కల్లూరు వైపు వెళ్తున్న ఓ కారు నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రెండు లక్షల నలభై వేల నగదును పోలీసులు పట్టుకున్నారు.
► కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధుంపూర్ బస్టాప్ దగ్గర పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వాహనంలో తీసుకెళ్తున్న మూడు లక్షల రూపాయలను కరీంనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
► నిజామాబాద్ కమ్మర్‌పల్లిలో 63వ నంబరు జాతీయ రహదారిపై కారులో తరలిస్తున్న 5,40,000 రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.