BJP : తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 600 మంది నేతలను రంగంలోకి దింపుతున్న కాషాయ పార్టీ.. ఇక తాడో పేడో తేల్చుకోవడమే తరువాయి..!
ABN , First Publish Date - 2023-06-28T14:22:31+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ రాజకీయాలు కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు.. తరువాత అన్నట్టుగా మారిపోయాయి. కర్ణాటక ఫలితాలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండేది. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో సత్తా చాటడం పక్కా అనుకుంటున్న తరుణంలో బీజేపీకి ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇప్పటికే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తెలంగాణ రాజకీయాలు కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు.. తరువాత అన్నట్టుగా మారిపోయాయి. కర్ణాటక ఫలితాలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉండేది. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో సత్తా చాటడం పక్కా అనుకుంటున్న తరుణంలో బీజేపీకి ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇప్పటికే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వినూత్న కార్యక్రమాలతో తెలంగాణపై మరింత పట్టు బిగించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. మరి బీజేపీ మిన్నకుంటే పనులవుతాయా? అసలుకే ఎసరొస్తుంది.
‘బీసీ గర్జన’ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ
ఇలాంటి తరుణంలో బీజేపీ అగ్ర నేతలు రంగంలోకి దిగకుంటే కష్టమేనని భావించారో ఏమో కానీ భారీ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించారు. ఇంతటితో సరిపోతుందా? అంటే ఏమాత్రం కుదరదు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీని లేపేందుకు జాకీలు అవసరం లేదు కానీ ఆ పార్టీ నేతలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిన పథకాలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా తెలంగాణ బీసీ ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. దీనిని క్యాష్ చేసుకునేందుకు ‘బీసీ గర్జన’ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇప్పటికే.. మే నెలలో ఓబీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇకపై మరింత ఫోకస్ చేయనుంది. అలాగే.. బీజేపీ మహాజన్ సంపర్క అభియాన్‌లో భాగంగా గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
గడగడపకు బీజేపీలో భాగంగా ఆ పార్టీ ఏం చేస్తోంది?
గడగడపకు బీజేపీలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలకు వివరించే యత్నం చేస్తోంది. దీనికోసం హైదరాబాద్ వేదికగా.. జూలై 8న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత కార్యదర్శులతో కీలక సమావేశాన్ని బీజేపీ నిర్వహించనుంది. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను తెలంగాణకు పార్టీ రప్పించనుంది. వీరితో పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను బీజేపీ చేపట్టనుంది. వీరంతా బృందాలుగా విడిపోయి మరీ పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నారు. ‘మేరా పోలింగ్ బూత్.. సబ్సే మజ్బూత్’ కార్యక్రమం ద్వారా బూత్ స్థాయిలో బీజేపీని ఈ సభ్యులు బలోపేతం చేయనున్నారు. మొత్తానికి బీజేపీ చరిష్మా ఉన్న నేతలను రంగంలోకి దింపి తెలంగాణలో తమ పార్టీ రాతను మార్చేందుకు విపరీతంగా కృషి చేస్తోంది. మరి ఆ కృషి సత్ఫలితాలను ఇస్తుందో.. లేదో వేచి చూడాలి.