BJP Leader: ‘టీఎస్పీఎస్సీ కమిటీకి నోటీసులు ప్రజలను ఫూల్స్ చేసే వార్తే’
ABN , First Publish Date - 2023-04-01T15:19:01+05:30 IST
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదని... ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ కేవలం పోలీసులు
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Leakage) లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయలేదని... ప్రస్తుతం విచారణ చేస్తున్న సిట్ కేవలం పోలీసులు వేసుకున్నదే అని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి (BJP Leader Indrasena reddy)వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... టీఎస్పీఎస్సీ కమిటీకి నోటీసులు అనే వార్త ప్రజలను ఫూల్స్ చేసేదే అని అన్నారు. రాష్ట్రంలో వేసిన సిట్లపై తమకు నమ్మకం లేదని, సిట్ వేశారంటే ఆ కేసును పర్మనెంట్‌గా పెండింగ్‌లో పెట్టడమే అని విమర్శించారు. ఇప్పటి వరకు వేసిన ఏ సిట్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదన్నారు. టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ... కానీ ఆ సంస్థ చైర్మన్‌ను కేసీఆర్ (CM KCR) ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారని ప్రశ్నించారు. తీగలాగితే తన డొంక బయటపడుతుంది అనే టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారని మండిపడ్డారు. సీక్రెట్ ప్లేస్‌లోకి వెళ్లే అధికారం టీఎస్పీఎస్సీ చైర్మన్‌కు కూడా ఉండదని తెలిపారు. క్వశ్చన్ పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో మెంబర్ సెక్రటరీకి తప్ప ఎవరికీ తెలియదన్నారు. టీఎస్పీఎస్సీని చెప్పుచేతల్లో పెట్టుకుని తనకు కావాల్సిన విధంగా పని చేయించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు.
సీల్డ్ కవర్లో తెస్తే ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందని... కంప్యూటర్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పేపర్లు టీఎస్పీఎస్సీకి ఆన్లైన్లో, సీల్డ్ కవర్, వాట్సాప్‌లో తెప్పించారా.. ఎలా తెప్పించారని నిలదీశారు. టీఎస్పీఎస్సీలో సెక్యూరిటీ విధానాలు పాటించారా లేదా అని అడిగారు. సీక్రెట్ రూంలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా... ఉంటే వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయాలన్నారు. టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని... గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తుచేశారు. డబ్బుకు కక్కుర్తి పడి కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు లేదనని ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు.