Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన.. ఇది నిజమైతే సిటీ జనానికి పండగే..!
ABN , First Publish Date - 2023-07-31T21:43:25+05:30 IST
వచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో భారీ విస్తరణ దిశగా ముందుకెళ్లనుంది. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకూ, ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకూ, ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ, రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ, శంషాబాద్ నుంచి కందుకూరు వరకూ మెట్రోను విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో భారీ విస్తరణకు ప్లాన్ చేసినట్లు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ పేర్కొన్న ప్రకారం.. వచ్చే నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో భారీ విస్తరణ దిశగా ముందుకెళ్లనుంది. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకూ, ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకూ, ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ, రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకూ, శంషాబాద్ నుంచి కందుకూరు వరకూ మెట్రోను విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. పాతబస్తీ దిశగా మెట్రోకు పిల్లర్లు పడుతున్నాయా, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు పనులకు శంకుస్థాపన చేస్తారా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎల్‌అండ్‌టీ చైర్మన్‌తో మాట్లాడడం, పాత అలైన్‌మెంట్ ప్రకారమే నిర్మాణం పూర్తి చేసేందుకు స్థానిక నేతలు, వ్యాపారులు అంగీకరిండంతో ఎన్నికల్లోపు శంకుస్థాపన చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మజ్లిస్ నేతలను, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లోపు శంకుస్థాపన?
ప్రభుత్వ సహకారంతో మొదటి విడతలో ఈ మార్గానికి హెచ్‌ఎంఆర్ నుంచి రైట్ ఆఫ్ వే (సరైన మార్గం) ఉండడంతో ఎల్‌అండ్‌టీ యాజమాన్యం సైతం కొంత ఆసక్తి కనబరుస్తోంది. ప్రభుత్వ సహకారం ఉండడంతో ముందుకు సాగాలని భావిస్తోంది. మెట్రోరైల్ ప్రాజెక్టులో భాగంగా కారిడార్-2లోని జేబీఎస్ - ఫలక్‌నుమా వరకు 16 కిలోమీటర్ల పనులు చేపట్టాలని హెచ్‌ఎంఆర్ భావించిన విషయం తెలిసిందే. ఆ పనుల్లో కేవలం పాతబస్తీ మినహా మిగతా అన్ని చోట్ల పూర్తికావడంతో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఓల్డ్‌సిటీ వాసులకు మాత్రం అధునాతన రైలు కలగానే మిగిలింది.
మళ్లీ శ్రీకారం..
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న 5.5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలని మజ్లిస్ నేతలు గట్టిగా పట్టుబడుతుండడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ మేరకు ఎలివేటెడ్ కారిడార్, పిల్లర్లు, వయాడక్టులు, స్టేషన్ల నిర్మాణం సందర్భంగా కావాల్సిన స్థలంపై ఇప్పటికే హెచ్‌ఎంఆర్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వారు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. గతంలో ప్రారంభించి మధ్యలో వదిలేసిన భూసార పరీక్షలను మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సంబంధిత విభాగంతో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ప్రధానంగా కారిడార్ నిర్మాణానికి 80 ఫీట్ల రోడ్డు కావాల్సి ఉంది. స్థానిక నేతలతో మాట్లాడుతూ దుకాణాదారులను వెనక్కి వెళ్లాలని ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రార్థన మందిరాలు, దర్గాలను తొలగించకుండానే కారిడార్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు
పాతబస్తీ మెట్రోను ఇప్పటికిప్పుడు ప్రారంభించినా దాదాపు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. పనులు పూర్తయ్యే వరకు ఎంజీబీఎస్ తర్వాత వచ్చే సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషేర్‌గంజ్, జంగంమెట్, ఫలక్‌నుమా మార్గాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలను ఇతర రూట్ల ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంపై హెచ్‌ఎంఆర్ అధికారులు ఇటు జీహెచ్‌ఎంసీ, అటు ట్రాఫిక్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఒక్కో పిల్లర్‌కు రూ.250 కోట్ల ఖర్చు..
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న మెట్రో పిల్లర్ ఒక్కోదానికి రూ.250 కోట్ల వరకు ఖర్చు కానుంది. మొత్తంగా రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. ఇంత మొత్తంతో ఎల్‌అండ్‌టీ పనులు పూర్తి చేస్తుందా.. లేదా.. అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పనులు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి