KCR : నో చెప్పేద్దాం!
ABN , First Publish Date - 2023-08-19T03:46:30+05:30 IST
రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార బీఆర్‌ఎస్(BRS) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నవారితోపాటు ప్రజల్లో పట్టు సాధించని వారిని పక్కనపెట్టాలని, సమర్థులకే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది.
20-25 మంది బీఆర్‌ఎస్ సిటింగ్‌లకు గండం?
ఆ ఎమ్మెల్యేలను మార్చేముందు ఫ్లాష్ సర్వే
98 శాతం కసరత్తు పూర్తిచేసి.. క్రాస్‌చెక్
ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఆరా
‘అసమ్మతి’ భేటీలకు అధిష్ఠానం ఆశీస్సులు?
అసంతృప్తులకు పదవులు ఇస్తామని హామీ
పట్నంకు మంత్రి, వీరేశంకు ఎమ్మెల్సీ
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార బీఆర్‌ఎస్(BRS) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. నియోజకవర్గాల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నవారితోపాటు ప్రజల్లో పట్టు సాధించని వారిని పక్కనపెట్టాలని, సమర్థులకే టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఇప్పటికే ఎంపిక ప్రక్రియను 98 శాతం దాకా పూర్తిచేసినా.. మళ్లీ ఓసారి పరిస్థితుల్ని నిర్ధారించుకునే పనిలో పడింది. అభ్యర్థులను మార్చాలనుకుంటున్న నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా గట్టి పోటీ ఇచ్చేవారు ఎవరున్నారనే దానిపై ఫ్లాష్ సర్వేలు చేపడుతోంది. రెండు మూడు రోజులపాటు ఆయా నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు బృందాలను రంగంలోకి దించి.. బరిలో ఎవరుంటే మేలు జరుగుతుందనే దానిపై ప్రజల నాడిని తెలుసుకోనుంది. బీఆర్‌ఎస్ ఈసారి 20-25 మంది దాకా సిటింగ్ ఎమ్మెల్యేల(Sitting MLAS)ను మార్చడం ఖాయమని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన విషయం తెలిసిందే. వీరిలో పూర్వ వరంగల్ జిల్లాలో అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడ్డ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య(Station Ghanpur MLA Rajaiah), జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy)లను తప్పించి.. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కడియంకు, పల్లాకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోనూ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై ప్రచారం జరుగుతున్నా.. ఉప్పల్ అభ్యర్థి మార్పు మాత్రం ఖాయమేనని తెలుస్తోంది. ఆ స్థానంలో లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తామని స్వయంగా కే సీఆర్ ఫోన్ చేశారు. అయితే తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో అభ్యర్థిగా లక్ష్మారెడ్డి బెటరా? బొంతు రామ్మోహన్ బెటరా? అనే అంశంపై ఫ్లాష్ సర్వేను బీఆర్‌ఎస్ నమ్ముకుంది. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఎవరికి వారు తమవారికి టికెట్లు ఇవ్వాలని కోరుతుండటంతో.. వారు ప్రతిపాదించిన అభ్యర్థుల బలాబలాలపై కూడా అధినేత సర్వేలు చేయిస్తున్నారు. తొలగించే అభ్యర్థులు ఉన్నచోట బలమైన ప్రత్యామ్నాయ అభ్యర్థులను వెతికే పనిలో పడ్డారు. సిటింగ్‌లను తొలగిస్తే అసంతృప్తి వస్తుందా? వస్తే పరిస్థితేంటి? అనే అంశాలు కూడా ఫ్లాష్ సర్వే ఫలితాలపై ఆధారపడనున్నాయి. ఇప్పటికే దీనిపై కేటీఆర్, హరీశ్‌రావులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. అయితే ఎవరెవరికి ఉద్వాసన పలకనున్నారనే దానిపై బీఆర్‌ఎస్ కూడా లీకులు ఇస్తోంది. దాంతో వారంతా మళ్లీ టికెట్ దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో అసంతృప్తుల సమావేశాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఫలానా అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వరాదంటూ వారు ఎన్నికల హీట్ పెంచుతున్నారు. నెల రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇదే కొనసాగుతోంది. కొందరు రహస్యంగా సమావేశమవుతుండగా, మరికొందరు బహిరంగంగానే సమావేశాలు పెడుతూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. దీనివెనుక అధిష్ఠానం వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే ఆరోపణలూ లేకపోలేదు. సిటింగ్‌లను సాగనంపే ముందు.. వారికి వ్యతిరేకంగా నిర్వహించే సమావేశాలకు పార్టీ ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత నిర్వహించిన సర్వే ఫలితాలకు కొనసాగింపుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం.
నియోజకవర్గాల్లో ప్రభావ వర్గాల చిట్టా
నియోజకవర్గాల్లో ఓటర్లను బలంగా ప్రభావితం చేసే వర్గాలపైనా బీఆర్‌ఎస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ప్రధానంగా సిటింగ్‌లను మారిస్తే ప్రతికూల ఫలితాలు రాకుండా ఆయా ప్రభావ వర్గాలను పార్టీలోకి రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా అసంతృప్తుల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జైపాల్‌యాదవ్‌ను తప్పిస్తే.. ఆ స్థానంలో నిలబెట్టే అభ్యర్థిని గెలిపించడానికి అవకాశాలను మెరుగుపరచాల్సి ఉంటుందన్న విషయాన్ని అధిష్ఠానం గుర్తించింది. ఇందుకోసం నియోజకవర్గంలో ప్రజాబలం కలిగిన వారిని పార్టీలో రప్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఓ మంత్రి.. ఫలానా నాయకుడు పార్టీలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్న ఆడియోలు వైరల్ అయ్యాయి. కాగా, పలు నియోజకవర్గాల్లో ప్రజల్లో విశ్వాసం ఉన్నా ఇప్పటివరకు టికెట్ దక్కక.. సానుభూతి పొందిన వారికి ఈసారి చాన్స్ ఇస్తారని అంటున్నారు.
వీరికి గండమే..
ఈసారి సిటింగ్‌ల మార్పు ఖాయమనే నియోజకవర్గాల జాబితాలో పూర్వ వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వరంగల్(తూర్పు)తో పాటు పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, పూర్వ మెదక్ జిల్లాలోని నర్సాపూర్, జహీరాబాద్ నియోజకవలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, ముషీరాబాద్, అంబర్‌పేటలోనూ కొత్త ముఖాలే రానున్నాయి.
వీరికి టికెట్ ఖాయమే...!
ఉమ్మడి మెదక్‌లోని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి (MLA Chilumula Madan Reddy)స్థానంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, ఖానాపూర్‌లో కేటీఆర్ బాల్యమిత్రుడు భూక్యా జాన్సన్ నాయక్‌కు, వేములవాడలో చెన్నమనేని రమేశ్ స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, వరంగల్ తూర్పు బరిలో నన్నపనేని నరేందర్ స్థానంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు, రామగుండంలో కోరుకంటి రవిచందర్‌కు బదులుగా సింగరేణి కార్మిక నేత లేదా మరో మహిళా నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ముషీరాబాద్, అంబర్‌పేటలలో తెరపైకి ఎవరు రానున్నారనేది తేలాల్సి ఉంది. కాగా, మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లో మాణిక్‌రావు స్థానంలో నరోత్తం లేదా ఎర్రోళ్ల శ్రీనివా్‌సకు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఎర్రోళ్లకు టికెట్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు బలంగా కోరుతుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక ఖమ్మం జిల్లా వైరాలో మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోపాటే మదన్‌లాల్ కూడా కాంగ్రె్‌సలో చేరాల్సి ఉండగా.. వైరాలో అవకాశం ఇస్తామన్న బీఆర్‌ఎస్ ముఖ్యుల హామీతోనే మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇక మునుగోడులో గుత్తా అమిత్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్‌లు బలమైన పోటీదారులుగా ఉన్నారు.
అసంతృప్తులకు పదవులు
పూర్వ రంగారెడ్డి జిల్లాల్లో పట్నం బ్రదర్స్‌లో ఒకరైన పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు(Tandoor) టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతుండడంతో.. వచ్చే టర్మ్‌లో మంత్రి పదవి ఇస్తానని ఆయనకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధం కాగా.. ఆయనకు అధిష్ఠానం నచ్చజెప్పి వచ్చే టర్మ్‌లో ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తామని ఒప్పించినట్లు తెలిసింది. ఇక స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యను తప్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. వేములవాడ సిటింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కూడా ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వనున్నారు.
వారసులకూ ఒక చాన్స్
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు(Korutla MLA Vidyasagar Rao) తన స్థానంలో తన కుమారుడు సంజయ్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తొలుత వారసులకు అవకాశం లేదని సంకేతాలిచ్చిన బీఆర్‌ఎస్ అధిష్ఠానం.. ఈ ఒక్క స్థానంలో మాత్రం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిసింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) కుమారుడు కూడా రాజేంద్రనగర్ టికెట్(Rajendranagar Ticket) ఆశిస్తుండగా.. ఆయనకు ఎలాంటి గ్యారంటీ లభించలేదని సమాచారం. అలాగే మిగిలిన చోట్ల కూడా ఇలాంటి ప్రతిపాదనలు రాగా అధినేత కేసీఆర్ తిరస్కరించారు.