CM KCR : మహా అయితే కవితను జైలుకు పంపిస్తారు!
ABN , First Publish Date - 2023-03-11T02:34:35+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు.
అంతే కదా.. ఏం చేస్తారో చూద్దాం.. భయపడం.. బీజేపీపై పోరాటం ఆపం: కేసీఆర్
2024 తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండదు
అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులోనే జరుగుతాయి
ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబరు, అక్టోబరులోనే రావచ్చు
అంతలోపు అభివృద్ధి పనులు పూర్తిచేయించండి
చేతులారా పోగొట్టుకుంటే తప్ప 99% సిటింగ్‌లకే సీట్లు
ఇకనుంచి దళితబంధు ఎంపిక బాధ్యత కలెక్టర్లకు
బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ, దర్యాప్తు సంస్థలతో వేధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రులను వేధించారు.. మరికొందరు పార్టీ నేతలను వేధించారు. ఇప్పుడు నా బిడ్డ దగ్గరకొచ్చారు. మహా అయితే కవితను అరెస్టు చేస్తారు.. జైలుకు పంపిస్తారు. అంతేగదా! ఏం చేస్తారో చూద్దాం.. ఎవరికీ భయపడేది లేదు. బీజేపీపై పోరాటం ఆపేదే లేదు. ఆ పార్టీని గద్దె దించేవరకు పోరాడతాం. 2024 తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండదు’’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బీజేపీ ఓర్వలేకపోతోందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని, తమ పార్టీ చేతగానితనం ఇతర రాష్ట్రాల్లో బయటపడుతుందనే అక్కసుతో బీజేపీ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.
‘‘ఇప్పటికే మన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో తప్పుడు ఆరోపణలతో బీజేపీ వేధిస్తోంది. ఈ వేధింపులను ఎంతవరకైనా తిప్పికొడతాం.. ఎదుర్కొంటాం. ఈ దేశం నుంచి బీజేపీని పారదోలేవరకూ మన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’’ అని కేసీఆర్ ఉద్ఘాటించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబరులోనే జరుగుతాయని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. డిసెంబరులో ఎన్నికలంటే అందుకు రెండు, మూడునెలల ముందే కేంద్రం ఎన్నికల నోటిఫికే షన్ ఇస్తుందని, ఇక మిగిలింది ఆరు నెలలు మాత్రమేనని తెలిపారు. నేతలంతా జనంలో ఉండాలని, నియోజకవర్గాల పరిధిలో పాదయాత్రలు చేపట్టాలని నిర్దేశించారు.
టీఆర్‌ఎస్ కాదు.. ఇకపై బీఆర్‌ఎస్ సభలే
ఇకపై టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలు ఉండవని, బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలోనే కార్యక్రమాలుంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. దానిని పురస్కరించుకొని ఏప్రిల్ 25న నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండాల ఆవిష్కరణ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాప్రతినిధుల సభలు నిర్వహించుకుందామన్నారు. అదే నెల 27న హైదరాబాద్‌లోని ఎల్బీ ేస్టడియంలో రాష్ట్ర స్థాయి పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత అక్టోబరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభను వరంగల్‌లో నిర్వహిస్తామన్నారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని చాలాసార్లు హెచ్చరించానని సీఎం గుర్తు చేశారు. కొందరు మారారని, మరికొందరు నేటికీ మేల్కొనలేదని అన్నారు. ‘‘మీ నిర్లక్ష్యంతో చేతులారా మీరు పోగొట్టుకుంటే తప్ప.. 99.9 శాతం సిటింగ్‌లకే సీట్లు దక్కుతాయి. డిసెంబరు కంటే ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సమయం లేనందున.. ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలో ఉండండి. మీ నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పూర్తి చేయించండి. నియోజకవర్గాల్లో గ్రూపులుగా ఏర్పడటం పార్టీకి, మీకూ మంచిది కాదు. మీ పరిధిలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకొనిపోయి పనిచేయండి’’ పార్టీ నేతలకు కేసీఆర్ నిర్దేశించారు.
దళిత బంధు ఎంపిక బాధ్యత కలెక్టర్లకే..
ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో దళితబంధు అర్హుల ఎంపిక, ప్రజాప్రతినిధుల పాత్రకు సంబంధించిన అవినీతి రికార్డు తన వద్ద ఉందని సీఎం తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని దళిత బంధు అర్హుల ఎంపిక బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకే అప్పగిస్తున్నానని ప్రకటించారు. ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనల్ని కలెక్టర్లకే పంపాల్సి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళితబంధు, గృహలక్ష్మి పథకాల లబ్ధిదారుల ఎంపికలో అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దని, హుందాగా వ్యవహరించాలని ఆదేశించారు. గృహలక్ష్మి లబ్ధిదారులను కూడా కలెక్టర్లే ఖరారు చేస్తారని, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు మాత్రం పంపించవచ్చని పేర్కొన్నారు. ‘‘గృహలక్ష్మి పథకం కింద మహిళల పేర్లతో కేటాయిస్తాం. భర్త పేరుతో స్థలం ఉంటే భార్య పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులిస్తాం. ప్రతి దశలోనూ రూ.లక్ష చొప్పున మూడు దశల్లో బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాం.
ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినా, పట్టా భూమి అయినా అన్ని రకాల స్థలాల్లో ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాం’’అని వివరించారు. ‘‘పార్టీకి కార్యకర్తలే బలం. వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేలా ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలి. త్వరలో నిర్వహించనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం ప్రజాప్రతినిధులు సిద్ధం కావాలి’’ అని సీఎం ఆదేశించారు. విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని తెలిపారు. మొన్న వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ ఫాక్స్‌కాన్ చైర్మన్ తెలంగాణను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారని, ఈ అభివృద్ధి, పార్టీ సాధించిన విజయాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం సంతాపం ప్రకటించింది.
ఏప్రిల్ 30న నూతన సచివాలయం ప్రారంభం
ముందుగా ప్రకటించిన తేదీ మార్పు
ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతిన విగ్రహావిష్కరణ మాత్రమే
జూన్ 1న అమరవీరుల స్తూపం..
నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్
ఏప్రిల్ 30న చేపట్టనున్న సచివాలయం ప్రారంభోత్సవానికి మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు పార్టీకి చెందిన అన్ని కేటగిరీల నాయకులు హాజరు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతోపాటు ఏప్రిల్ 14న బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ఎన్టీఆర్ ేస్టడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘననివాళి అర్పిస్తూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతిని జూన్ 1న ప్రారంభించుకుందామన్నారు.
ఇక జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసేలా విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని అధినేత ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలని, ఎన్నికల కోడ్ అనంతరం ఇంకా మిగిలి ఉన్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ పూర్తికావాలని నిర్దేశించారు. 58, 59 జీవోల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని ఎమ్మెల్యేలు పేద ప్రజల కోసం సద్వినియోగపరుచుకోవాలన్నారు.