TS Congress: దరఖాస్తులు ఫుల్.. కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ అయ్యేదెప్పుడంటే..!
ABN , First Publish Date - 2023-08-26T14:48:29+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్‌లో పోటీ చేసే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావాహుల రాకతో గాంధీభవన్ కళకళలాడింది. ఈసారి మాత్రం సీనియర్లు పక్కకు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పోటీ చేసే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావాహుల రాకతో గాంధీభవన్ కళకళలాడింది. ఈసారి మాత్రం సీనియర్లు పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. వారసులను రంగంలోకి దించినట్లు సమాచారం. సీనియర్ నేత జానారెడ్డి పోటీ నుంచి తప్పుకుని ఇద్దరి కుమారులను బరిలోకి దింపారు. మిర్యాలగూడ నుంచి పెద్ద కుమారుడు.. నాగార్జునసాగర్ నుంచి చిన్న కుమారుడు పోటీలోకి వచ్చారు. ఈ మేరకు వారిద్దరూ గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి లాగానే పలువురు సీనియర్లు బరి నుంచి తప్పుకుని వారసులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేసే వారి నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు కోరడంతో ఆశావాహులంతా అప్లై చేసుకున్నారు. 119 నియోజకవర్గాల నుంచి 1025 దరఖాస్తులు గాంధీభవన్‌కు చేరాయి. ఈ అప్లికేషలన్నీ వడపోత చేయనున్నారు. ఇందుకోసం ఆదివారం నుంచి దరఖాస్తుల స్క్రూట్నీ ప్రక్రియ ప్రారంభంకానుంది. అలాగే ఒకటి, రెండు రోజుల్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ భేటీలో దరఖాస్తుదారుల అర్హతపై చర్చించనున్నారు. పోటీలో ఉండేదెవరు? పోయేదెవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.
ఇక కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. కొడంగల్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చి చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో విపరీతమైన కాంపిటేషన్ నెలకొంది. ఈ సెగ్మెంట్లకు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఇల్లందు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గానికి 38 మంది దరఖాస్తులు వచ్చాయి.