TS CPM: కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు కటీఫ్.. ఒంటరిగానే బరిలోకి.. జాబితా విడుదల
ABN , First Publish Date - 2023-11-02T17:18:42+05:30 IST
ఇస్తామన్న సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. భద్రాచలంలో 8 సార్లు వరుసగా గెలిచాం. పాలేరు, భద్రాచలం సీటు కావాలని మేము పట్టుపట్టం. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు.
‘‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట’’ ఈ సినిమా పాట గుర్తుంది కదా?. అచ్చం అదే పాట మాదిరిగా ఉన్నాయి తెలంగాణలోని కొన్ని పార్టీల పరిస్థితి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ.. కమ్యూనిస్టు పార్టీల సహాయంతో విజయం సాధించింది. అదే పొత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఆశలు పెట్టుకున్నాయి. కానీ వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. కనీసం వాళ్లతో సంప్రదించకుండానే సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో గులాబీ పార్టీపై లెఫ్ట్ పార్టీలు గరం గరం అయ్యారు.
కాంగ్రెస్‌తో కటీప్..
తదనంతరం కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేందుకు కామ్రేడ్లు చర్చలు జరిపారు. ఇరు పక్షాల నుంచి ముఖ్య నేతలు సీట్ల కేటాయింపుపై మంతనాలు జరిపారు. ఇప్పటిదాకా ఆ సీట్లు.. ఈ సీట్లు అంటూ లీకులు ఇచ్చుకుంటూ ఇన్ని రోజులు ఊరించి.. ఊరించి.. చివరికి ఉసురుమనిపించారు. కాంగ్రెస్ దగ్గర కూడా రిక్తహస్తమే మిగిలింది. వామపక్షాలు కోరిన సీట్లు ఇచ్చేందుకు హస్తం పార్టీ మొగ్గుచూపించినట్లు కనిపించలేదు. దీంతో చెయ్యి పార్టీకి కటీప్ చెప్పాలని కమ్యూనిస్టులు నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే సీపీఎం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసింది. 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక సీపీఐ కూడా అదే బాటలో ఉన్నట్లు సమాచారం. రేపు సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం అవుతోంది. ఈ భేటీలో కాంగ్రెస్‌తో వెళ్లేదో.. లేదో స్పష్టమైన ప్రకటన చేయనుంది.
వైఎస్సాఆర్‌టీపీకి కూడా సేమ్ సీన్..
గతంలో కూడా వైఎస్సాఆర్‌టీపీ పరిస్థితి ఇలానే అయింది. వైఎస్సాఆర్‌టీపీ.. కాంగ్రెస్‌లో విలీనంపై హస్తిన వేదికగా సోనియా, రాహుల్‌తో షర్మిల చర్చలు జరిపారు. విలీనం అంటూ చాలా రోజులు వార్తలు షికార్లు చేశాయి. కానీ చివరికి చెయ్యి పార్టీ మొండిచెయి చూపించింది. దీంతో షర్మిల ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. పాలేరు నుంచి షర్మిల.. కొడంగల్ నుంచి బ్రదర్ అనిల్ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓడించడమే లక్ష్యంగా షర్మిల రాజకీయ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. వైఎస్సాఆర్‌టీపీ.. కాంగ్రెస్‌లో విలీనం కాకుండా అడ్డుకున్నది రేవంతేనని షర్మిల భావిస్తోంది. దీనికి ప్రతీకారంగా రేవంత్‌ను ఓడించాలని ఆమె ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
తమ్మినేని వీరభద్రం కామెంట్స్..
‘‘బీజేపీ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిచేలా చూస్తాం. ఆ స్థానాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం ఉండకూడదు అనేది మా నినాదం. బీజేపీ కాకుండా ఎవరు గెలిచే అవకాశం ఉంటుందో వారికీ ఆ నియోజకవర్గాల్లో మద్దతు ఉంటుంది. సీపీఐ మాతో వచ్చినా ఓకే. రాకపోయినా ఓకే. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా లేదా సీపీఐ ఒంటరిగా బరిలోకి దిగినా సీపీఐకే ఓటు వేయాలని ప్రచారం చేస్తాం.’’ అని తమ్మినేని వీరభద్రం అన్నారు.
కటీఫ్ ఎందుకంటే..!
‘‘ఇస్తామన్న సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. భద్రాచలంలో 8 సార్లు వరుసగా గెలిచాం. పాలేరు, భద్రాచలం సీటు కావాలని మేము పట్టుపట్టం. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. మేము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు మేము ఒకే అన్నాం. కాంగ్రెస్‌తో పొత్తుల అంశంలో చాలా మెట్లు మేము దిగాం. వైరా ఇస్తామని...మళ్ళీ మాట మార్చి ఇస్తామని అనలేదు అంటూ భట్టి విక్రమార్క అబద్ధం అడారు. అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ అనుకుంటుంది. పొత్తుల బ్రేకప్ మేము కోరుకుంది కాదు. ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు తీసుకోవడం సీపీఎం పార్టీ విధానం కాదు. సీపీఎం ఆనాడే ప్రధాని పదవిని సూత్రప్రాయంగా వదిలివేశాం. దాదాపు 24 సీట్లకు ప్రతిపాదనలు వచ్చాయి. కార్యవర్గంలో చర్చించి మరో రెండు మూడు సీట్లు ప్రకటిస్తాం. ఈ ప్రకటించిన సీట్లలో మార్పులు జరిగే అవకశాలున్నాయి. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదరకపోతే మార్పులు ఉంటాయి. ఖమ్మం జిల్లాలో 5 సీట్లలో పోటీ చేస్తున్నాం. నల్గొండ, మిర్యాలగూడ, నకిరేకల్‌లో పోటీ చేస్తున్నాం. అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం. బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ గెలుపు అవకాశం ఉన్న సీట్లలో మేము పోటీ చేయం. కమ్యూనిస్టులు లేని శాసనసభలు దేవుడి లేని దేవాలయాలు లాగా ఉంటాయి.’’ అని తమ్మినేని వ్యాఖ్యానించారు.