Sitaram Yechury: కవిత దీక్ష, ఉద్యమానికి పూర్తి మద్దతుగా నిలుస్తాం
ABN , First Publish Date - 2023-03-10T12:21:15+05:30 IST
మహిళా రిజర్వేషన్ బిల్లుపై 30 ఏళ్ళుగా చర్చ జరుగుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై 30 ఏళ్ళుగా చర్చ జరుగుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (CPM General Secretary Sitaram Yechury) అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు (Womens Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేపట్టిన నిరాహార దీక్షలో సీతారం ఏచూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలకు భాగస్వామ్యం లేకపోతే ఎలాంటి వ్యవస్థ మనుగడ సాగించలేదన్నారు. ఒకసారి బిల్లు తీసుకువచ్చామని.. కానీ, అది సగంలోనే నిలిచిపోయిందని తెలిపారు. సోమవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశా (Parliamen Session)ల్లో బిల్లు తీసుకురావాలన్నారు. ఇది మోడీ (PM Narendra Modi) చేసిన ప్రమాణం అని.. 9 ఏళ్ళు పూర్తి అవుతోంది... ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆయన మండిపడ్డారు.
పంచాయతీల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నపుడు... చట్ట సభల్లో ఎందుకు అమలులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కవిత దీక్ష, ఉద్యమానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సోమవారం నుండి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.