DK Aruna: గద్వాల ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి డీకే అరుణ విజ్ఞప్తి
ABN , First Publish Date - 2023-09-05T15:51:57+05:30 IST
అసెంబ్లీ కార్యదర్శితో బీజేపీ నేత డీకే అరుణ భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీకి చేరుకున్న డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శితో సమావేశమై.. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: అసెంబ్లీ కార్యదర్శితో బీజేపీ నేత డీకే అరుణ (BJP Leader DK Aruna) భేటీ అయ్యారు. మంగళవారం అసెంబ్లీకి చేరుకున్న డీకే అరుణ అసెంబ్లీ కార్యదర్శితో సమావేశమై.. తనను గద్వాల ఎమ్మేల్యేగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల ఎమ్మేల్యే కృష్ణమోహన్ రెడ్డిని (Gadwala MLA Krishnamohan Reddy) అనర్హుడిగా ప్రకటించాలని.. డీకే అరుణను ఎమ్మేల్యేగా గుర్తించాలని ఇటీవల హైకోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్ట్ ఆర్డర్ కాపీని కేంద్ర ఎన్నికల సంఘం, అసెంబ్లీ కార్యదర్శికి ఇప్పటికే డీకే అరుణ అందజేశారు. డీకే అరుణను ఎమ్మేల్యేగా గుర్తిస్తూ గెజిట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఈరోజు (మంగళవారం) డీకే అరుణ అందజేశారు.
అనంతరం బీజేపీ నేత మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో గద్వాల ఎమ్మేల్యే తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని.. దీనిపై నేను హైకోర్టుకు వెళ్లానని అన్నారు. కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మేల్యే ఎన్నిక చెల్లదని తనను ఎమ్మేల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. హైకోర్ట్ తీర్పు అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. రాష్ట్ర గెజిట్‌లో పబ్లిష్ చేయాలని ఆదేశించిందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆర్డర్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశానని అన్నారు. తన ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయాలని కోరానని.. స్పీకర్‌కు ఫోన్ చేశాను అందుబాటులోకి రాలేదన్నారు. తీర్పు వచ్చి 15రోజులైనా ఇంకా తనకు న్యాయం జరగలేదన్నారు. స్పీకర్ నుంచి సానుకూలంగా స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. హైకోర్ట్‌ను కృష్ణమోహన్ రెడ్డి లెక్క చేయలేదని.. న్యాయస్థానం నుంచి నోటీస్ రాలేదనడం తప్పన్నారు. హైకోర్ట్ కౌంటర్ వేయకుండా సుప్రీంకు వెళ్లడం న్యాయం కాదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే కృష్ణ మోహన్ రెడ్డి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.