Swapnalok Fire Accident: స్వప్నలోక్ ఘటనపై అగ్నిమాపక అధికారుల సీరియస్
ABN , First Publish Date - 2023-03-17T10:54:06+05:30 IST
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు సీరియస్ అయ్యారు.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ అగ్నిప్రమాదం (Swapnalok Fire Accident)పై అగ్నిమాపక శాఖ అధికారులు (Fire Officials) సీరియస్ అయ్యారు. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ ప్రమాదం (Secunderabad Deccan Mall accident) తర్వాత కూడా షాపింగ్ మాల్ నిర్వహకుల్లో మార్పు రాని పరిస్థితి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో దాదాపు 250 పైగా షాపులు ఉన్నాయి. జంటనగరాల్లోనే అతిపెద్ద పురాతన షాపింగ్ కాంప్లెక్స్‌గా స్వప్నలోక్ భవనానికి పేరు ఉంది. మూడేళ్ల క్రితమే స్వప్నలోక్ భవనం పెచ్చులు ఊడి ఒక వ్యక్తి మృతి చెందాడు. అయితే అధికారుల నోటీస్‌తో తూతూ మంత్రంగా భవన మరమ్మత్తులు చేపట్టారు. ఫైర్ సేప్టీ నిబంధనలను స్వప్నలోక్ కాంప్లెక్స్ యజమాని గాలికి వదిలేశాడు. దీంతో నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
ముగిసిన సెర్చ్ ఆపరేషన్
స్వప్నలోక్ భవనంలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారనే అనుమానంతో డీఆర్‌ఎఫ్ బృందం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ పూర్తి అయ్యింది. స్వప్నలోక్ భవనంలో బ్రోన్టో స్కై లిఫ్ట్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. వాష్ రూంతో పాటు, డార్క్ రూముల్లో ఎవరు లేరని పోలీసులు తేల్చారు. మరికాసేపట్లో టెక్నికల్ టీం ఘటనాస్థలి వద్దకు రానుంది. అగ్ని మాపక జాగ్రత్తలపై టీం అధ్యయనం చేయనుంది. బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించనుంది. టెక్నికల్ టీం ఇవ్వనున్న నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ, ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.