Gone Prakash: వారికి సీఎం పదవి ఇస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి.. లేదంటే ఇక అంతే
ABN , First Publish Date - 2023-10-20T12:03:57+05:30 IST
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు అన్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌రావు (Former MLA Gone Prakash Rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి సీఎం అభ్యర్థి ఉండాలన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), కేసీ వేణుగోపాల్‌కు (KC Venugopal) గోనె ప్రకాష్ లేఖ రాశారు. టికెట్ల కేటాయింపులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌లో పారాచుట్లకు స్థానం కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని తెలిపారు. సీట్లు అమ్ముకున్నారని తాను అనడం లేదని.. సీట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొందని ఆయన చెప్పుకొచ్చారు.
సీట్ల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు జరపాలని కోరారు. అనేక సార్లు ఓడిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ సీటు ఇస్తుందన్నారు. పొంగులేటి, తుమ్మల బీఆర్ఎస్‌లో గెలవలేక పోయారని.. కాంగ్రెస్‌లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను కుటుంబ పాలన అనే అర్హత లేదన్నారు. బోథ్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు పోతాయని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారన్నారు. టికెట్ల వ్యవహారం లో అన్యాయం జరిగిందని విమర్శించారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే కనుచూపు మేరలో కాంగ్రెస్ కనపడదన్నారు. బడుగు బలహీన వర్గాలకు సీఎం పదవి కేటాయిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గోనె ప్రకాష్‌రావు పేర్కొన్నారు.