BRS MLAS Tickets: సగం అగ్రకులాలకే
ABN , First Publish Date - 2023-08-22T03:02:47+05:30 IST
బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే(BRS sitting MLA)ల్లో పలువురిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా.. అనివార్యంగా మళ్లీ వారికే టికెట్లు కట్టబెట్టారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR). తొలి విడతలోనే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. అందులో సిటింగ్‌లకే పెద్దపీట వేసి అందరినీ ఆశ్చర్చపరిచారు.
బీసీలకు ఐదో వంతే.. 23 మందితో సరిపెట్టిన కేసీఆర్..
బీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదల
33% రిజర్వేషన్ కోసం కవిత ఢిల్లీలో
ఎలుగెత్తినా.. ఇక్కడ ఇచ్చింది ఏడు సీట్లే
వ్యతిరేకత ఉన్నా సిటింగ్‌లకే
ఒత్తిడికి తలొగ్గి టికెట్ల కేటాయింపు
ఎనిమిది చోట్ల మాత్రమే సిటింగ్‌ల మార్పు
ఐదుగురు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై వేటు
గజ్వేల్, కామారెడ్డి నుంచీ బరిలో కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే(BRS sitting MLA)ల్లో పలువురిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలిసినా.. అనివార్యంగా మళ్లీ వారికే టికెట్లు కట్టబెట్టారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR). తొలి విడతలోనే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. అందులో సిటింగ్‌లకే పెద్దపీట వేసి అందరినీ ఆశ్చర్చపరిచారు. ఇందులో దాదాపు సగం మంది అగ్రకులాల వారికే అవకాశం కల్పించారు. బీసీలకు 23 సీట్లు(23 seats for BCs) మాత్రమే కేటాయించి ఐదో వంతుకే పరిమితం చేశారు. మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో నిరసనలు చేపట్టి, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ కదిలేలా చేసినా.. బీఆర్‌ఎస్ తాజా జాబితా(BRS MLAS Latest List)లో మాత్రం కేవలం ఏడుగురు మహిళలకే స్థానం కల్పించి 6శాతానికే పరిమితమయ్యారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలో వామపక్షాల సహకారం పొందిన కేసీఆర్.. సాధారణ ఎన్నికల్లో వారితో పొత్తు ఉంటుందని ప్రకటించినా వారు కోరుతున్న స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి కమ్యూనిస్టులకు మొండిచేయి చూపారు. ఇదిలా ఉండగా 20-25 మంది బీఆర్‌ఎస్ సిటింగ్‌లను మారుస్తారన్న ప్రచారం మొదటినుంచీ జరిగింది.
పార్టీ తరఫున చేయించిన సర్వేల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం వెల్లడైందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిటింగ్ ఎమ్మెల్యేల్లో పలువురు రెండుసార్లు గెలిచిన వారుండగా, మరికొందరు మూడుసార్లు గెలుపొందిన వారు కూడా ఉన్నారు. దీంతో వారిపై ప్రజల్లో వారిపై కొంత వ్యతిరేకత ఏర్పడటంతోపాటు రాజకీయంగానూ సొంత పార్టీలోనే వారి పట్ల అసంతృప్తులు, అసమ్మతులు పెరిగిపోయాయి. అయినా.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ పెద్దసంఖ్యలో సిటింగ్‌ల వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. చివరకు 8 స్థానాల్లో మాత్రమే సిటింగ్‌లను మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించారు. సిటింగ్‌ల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గడంతోపాటు.. వారికి సీటు ఇవ్వకుంటే పార్టీ మారతారనే ఆందోళన కూడా దీనికి ఒక కారణమని తెలుస్తోంది. అదే సమయంలో.. ప్రభుత్వంపై సానుకూలత ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరన్నది కాకుండా ముఖ్యమంత్రిగా తనను చూసి, పార్టీని చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు.
రెండు చోట్ల పోటీ అందుకే..!
సీఎం కేసీఆర్ తొలిసారి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కామారెడ్డి ప్రాంతం తన పూర్వీకులది కావడంతోనే ఇక్కడినుంచి బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పోటీచేసే సిరిసిల్ల నియోజకవర్గానికి కామారెడ్డి నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. మరోవైపు కుమార్తె కవిత ఎంపీగా పోటీచేసే నిజామాబాద్ లోక్‌సభ స్థానంపైనా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లేకపోయినా.. ఒకప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే చెందిన కామారెడ్డిలో పోటీ కుమార్తె కవితకు కూడా కొంత మద్దతుగా పనికొస్తుందనే ఆలోచన కూడా ఉందని అంటున్నారు.
58 మంది ఓసీ అభ్యర్థులే..
కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో సగం మంది ఓసీలే ఉన్నారు. మొత్తం 115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసీ అభ్యర్థులే. ఇందులో రెడ్డి సామాజిక వర్గం వారు 40 మంది, వెలమలు 11 మంది, కమ్మ సామాజికవర్గం వారు ఐదుగురు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. బీసీల నుంచి 23 మందికి అవకాశం కల్పించారు. అన్ని పార్టీలూ బీసీలకు సీట్లు పెంచాలంటూ డిమాండ్లు వచ్చినా.. దానిని కేసీఆర్ ఖాతరు చేయలేదు. ఇదిలా ఉండగా.. టికెట్ల విషయంలో అసంతృప్తులు, అలకలు రాకుండా వారం రోజుల నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీ్‌షరావు కసరత్తు చేసినా.. జాబితా ప్రకటించాక అసంతృప్తులు బాహాటంగానే బయటికొచ్చారు. ఖానాపూర్ సిటింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుండగా, కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి వెళ్లగక్కారు.
సంచలనంగా మారిన మైనంపల్లి వ్యవహారం..
కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించానికి సరిగ్గా రెండున్నర గంటల ముందు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మంత్రి హరీ్‌షరావుపై ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు, ఆరోపణలు దుమారం రేపాయి. తనకు తిరిగి మల్కాజ్‌గిరి నుంచి సీటు, అదనంగా తన కుమారుడికి మెదక్ నుంచి కూడా సీటిస్తే సరి.. లేకుంటే మాత్రం తడాఖా చూపిస్తా అన్న రీతిలో వ్యాఖ్యానాలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన రెండున్నర గంటల తర్వాత కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో మల్కాజ్‌గిరి అభ్యర్థిగా హనుమంతరావుకే అవకాశం కల్పించారు. మెదక్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికే తిరిగి అవకాశం ఇచ్చారు. మరి ఇద్దరికీ సీటు ఇస్తేనే అన్న హనుమంతరావు ఒకరికే సీటిచ్చిన పరిణామంపై ఎలా ప్రతిస్పందిస్తారని ఆయన అనుచరులు కూడా వేచి చూశారు. మరోవైపు అన్ని మాటలన్న మైనంపల్లికి సీటివ్వడం ఏంటన్న చర్చ పార్టీలోనూ జరిగింది. కాగా, పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో తొలి జాబితాను స్వయంగా ప్రకటించిన కేసీఆర్.. అవసరమైతే ఒకరిద్దరిని మారుస్తామని కూడా చెప్పడం గమనార్హం. ఇప్పుడే ఆ మార్పులు చేపడితే అసంతృప్తులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.