Heavy Rains: వర్షం కారణంగా పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పరిస్థితి ఎలా ఉందంటే...
ABN , First Publish Date - 2023-07-20T10:44:43+05:30 IST
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి.
హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. అటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్డుపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. విషయం తెలిసిన వెంటనే డీఆర్‌ఎఫ్ సిబ్బంది పెద్దమ్మ టెంపుల్ ప్రధాన రహదారి వద్దకు చేరుకుంది. రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీరును క్లియర్ చేసే పనిలో డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తం చేస్తోంది. వర్ష ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న వారు డీఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో వరద నీరుతో భారీగా జామ్ అయిన 50 ప్రాంతాలు క్లియర్ చేశామని అధికారులు వెల్లడించారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు.