Revanth Reddy : ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటి? అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకంటూ హైకోర్టు ఫైర్
ABN , First Publish Date - 2023-07-28T13:56:24+05:30 IST
ఓఆర్ఆర్ టోల్‌గేట్ టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటని.. అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్ : ఓఆర్ఆర్ టోల్‌గేట్ టెండర్లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) వేసిన పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. ఎంపీ అడిగితే వివరాలు ఇవ్వకపోవడమేంటని.. అసలు ఆర్టీఐ ఉన్నది ఎందుకని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీలో వాళ్లు ఏం మాట్లాడుతారని హైకోర్టు నిలదీసింది. వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రెండు వారాల లోపు రేవంత్ రెడ్డి అడిగిన వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4 కు హైకోర్టు వాయిదా వేసింది.
ఓఆర్‌ఆర్ టెండర్లపై సమాచారం ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన ఆర్‌టీఐ దరఖాస్తుకు హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించలేదని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తాను దాఖలు చేసిన పిటిషన్‌లో రేవంత్ రెడ్డి హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఆర్‌టీఐ కింద అడిగిన సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని హైకోర్టు వేసిన పిటిషన్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.