Hyderabad: అకాలవర్షంతో పంటనష్టంపై సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ
ABN , First Publish Date - 2023-03-20T17:02:08+05:30 IST
అకాల వర్షాలతో పంట నష్టపోయిన (Crop loss)రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం కేసీఆర్(CM KCR)కు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Badi Sanjay) లేఖ రాశారు.
Hyderabad:: అకాల వర్షాలతో పంట నష్టపోయిన (Crop loss)రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం కేసీఆర్(CM KCR)కు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Badi Sanjay) లేఖ రాశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన(Crop loss) రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు సమగ్ర పంటల బీమా పథకాన్ని(Comprehensive Crop Insurance Scheme) రూపొందించకపోవడం సిగ్గు చేటన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులందరికీ యుద్ద ప్రాతిపదికన పరిహారం అందించాలన్నారు. వ్యవసాయంలో అద్బుతాలు సృష్టించేందుకు రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందిస్తామని గతంలో మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పంటల బీమా పథకం రూపకల్పన విషయంలో మీ నిర్లక్ష్యంవల్ల తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో ఏళ్ల తరబడి రైతులు(Farmers) నష్టపోతూనే ఉన్నారని ఆరోపిస్తూ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేస్తే రైతులకు పరిహారం(Compensation) అందే అవకాశముండేదని.. బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో మీరు ఈ పథకాన్ని రాష్ట్రానికి వర్తింపజేయకపోవడంవల్ల ఏళ్ల తరబడి రైతులు నష్టపోతూనే ఉన్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపునైనా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టికొడుతుండటం క్షమించరాని నేరం అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల విశాల ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకుని సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.