Hyderabad: బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2023-03-31T09:38:39+05:30 IST
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్‌పేట వంతెనల నిర్మాణంలో జాప్యానికి సంబంధించి బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, అంబర్‌పేట వంతెనల నిర్మాణంలో జాప్యానికి సంబంధించి బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. ఐదేళ్లయినా పూర్తి చేయలేదు.. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో అని ఒకరంటే.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మరొకరు అంటున్నారు. రెండు పార్టీల మధ్య విమర్శలకు వంతెనల పిల్లర్లు వేదికగా మారాయి.
హైదరాబాద్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇంకెన్నాళ్లు అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలతో ఇటీవల ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా..అదే వంతెన పిల్లర్లకు వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నట్లుగా ఓ పత్రికలో ప్రచురితమైన కథనంతో పోస్టర్లు వెలిశాయి. ఇవి బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంబర్‌పేట ఛే నెంబర్ వంతెన పిల్లర్లపై మోదీ ఫొటోతో ఫ్లెక్సీలు కనిపించాయి. ఫ్లై ఓవర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని ప్రశ్నించారు. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధంతోపాటు ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది.
నాడు ఆస్తుల సేకరణలో.. నేడు నిర్మాణంలో..
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్, గోల్నాక నుంచి అంబర్‌పేట గాంధీ బొమ్మ వరకు 1.5 కి.మీ. మేర వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2018 మే 5న పనులకు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. కొందరు యజమానులు కోర్టును ఆశ్రయించడంతో భూ సేకరణలో ఆలస్యం జరిగింది. ఓ స్థలానికి సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదం నెలకొనడమూ ఇందుకు కారణం. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నల్ల చెరువు బస్టాండ్ వరకు ఆస్తుల సేకరణకూ ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. ఆస్తుల సేకరణ పూర్తయినా.. వంతెనల నిర్మాణం మాత్రం వేగంగా జరగడం లేదు. రెండు ప్రాజెక్టులను జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టింది. ఇదే రెండు పార్టీల మధ్య వార్‌కు దారి తీసింది.