Hyderabad Traffic Alert: హైదరాబాద్‌లోని ఈ బిజీ రూట్‌లో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , First Publish Date - 2023-03-10T16:09:02+05:30 IST
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇందిరా పార్కు సమీపంలో నిర్మిస్తున్న స్టీల్‌బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో..
హైదరాబాద్ : నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రోడ్లవిస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ బ్రిడ్జిల నిర్మాణం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లవిస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాసింగ్‌లు, అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతోంది. అయితే ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్న పలుప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇందిరా పార్కు(Indira Park) సమీపంలో స్టీల్‌బ్రిడ్జి(Steel Bridge) నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. ఈ రూట్లో వచ్చే వాహనదారులు మరో రూట్లో వెళ్లాలని సూచించారు. చిక్కడపల్లి (Chikadpally)నుంచి అశోక్‌నగర్ (AshokNagar) వైపు వచ్చే వాహనాలను సిటీ సెంట్రల్ లైబ్రరీ (Central Libriary ) వైపు, వీఎస్‌టీ(VST) నుంచి అశోక్‌నగర్(AshokNagar) వైపు వచ్చే వాహనాలను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్(RTC Cross Road)మీదుగా వెళ్లాలని సూచించారు.
ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వైపు వెళ్లే వాహనాలను జగదాంబ ఆస్పత్రి మీదుగా, సీజీఓ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వైపు వచ్చే వాహనాలను ఆర్సీరెడ్డి, ఆంద్రాకేఫ్ వైపు, స్ట్రీట్ నెంబర్ 9 నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వైపు వెళ్లే వాహనాలను అశోక్‌నగర్ వైపు మళ్లించనున్నారు. ఈ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10 వరకు మూడు నెలల పాటు అమలులో ఉంటాయని, వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు.