T.highcourt: ఆ రూ.500కోట్లు ఎలా ఖర్చు చేశారు?.. వరద సాయంపై సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
ABN , First Publish Date - 2023-08-11T14:20:44+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌లో శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌లో శుక్రవారం హైకోర్టులో (Telangana Highcourt) విచారణ జరిగింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను ప్రభుత్వం (Government) హైకోర్టుకు అందజేసింది. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై న్యాయస్థానం విచారణ జరిపింది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. రూ.500 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు వెల్లడించింది. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు సమర్పించారు. రూ.500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని హైకోర్టు ప్రశ్నించింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి(ఆగష్టు 17) వాయిదా వేసింది.