KCR GOVT : ఇరకాటంలో కేసీఆర్‌ సర్కార్‌

ABN , First Publish Date - 2023-08-01T03:30:05+05:30 IST

మూడేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల(Three Cultivation Acts)కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం(Compensation) అందించే విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం(KCR GOVT) ఇరకాటంలో పడింది.

KCR GOVT : ఇరకాటంలో కేసీఆర్‌ సర్కార్‌

  • సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన రైతుల

  • వివరాలు కేంద్రానికి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం

  • కేసీఆర్‌కు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ

  • మంత్రి లేఖ రాసినా ఇంకా అందని వివరాలు

  • పార్లమెంటరీ స్థాయీసంఘానికి కేంద్రం వెల్లడి

  • లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా

  • నాగేశ్వరరావు ప్రశ్నతో తలెత్తిన ఇబ్బంది

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల(Three Cultivation Acts)కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం(Compensation) అందించే విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం(KCR GOVT) ఇరకాటంలో పడింది. ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు మరణించారని, వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్‌(CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన పంజాబ్‌కు వెళ్లి కొన్ని కుటుంబాలకు చెక్కులు కూడా అందించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు(MP Nama Nageswara Rao) దీనిపై లోక్‌సభ(Lok Sabha)లో ప్రశ్న వేశారు. ‘‘రైతుల ఉద్యమంలో మరణించిన 750 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిన విషయం కేంద్ర ప్రభుత్వ అవగాహనలో ఉందా? ఉద్యమ సమయంలో ఎంత మంది రైతులు మరణించారన్న డేటాను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సేకరించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటి?’’ అని నామా నాగేశ్వర రావు అడిగారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌(Narendra Singh Tomar) సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి సమాచారం అడిగామని.. కానీ, ఇప్పటికీ వివరాలు అందలేదని 2021 డిసెంబరు 21న ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.


అయితే, ఈ లిఖితపూర్వక సమాధానాన్ని హామీల అమలు పార్లమెంటరీ కమిటీ.. హామీగా పరిగణించింది. దాంతో హామీ అమలు స్థితి ఏమైందని పార్లమెంటరీ కమిటీ అడుగుతున్న ప్రశ్నకు వ్యవసాయ శాఖ సమాధానం చెప్పడం అనివార్యమైంది. తెలంగాణ ప్రభుత్వం వివరాలు అందించడం లేదని.. వివరాలు లేనిదే హామీపై స్పష్టత ఇవ్వడం సాధ్యంకాదని, కాబట్టి హామీల జాబితా నుంచి ఈ ప్రశ్నను తొలగించాలని కమిటీకి కేంద్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. తమ శాఖకు చెందిన వివిధ స్థాయుల కార్యదర్శులు పదేపదే విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వట్లేదని పేర్కొంది. అయితే, కేంద్ర వ్యవసాయ శాఖ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన హామీల అమలు పార్లమెంటరీ కమిటీ.. హామీల జాబితా నుంచి నామా ప్రశ్నను తొలగించడానికి నిరాకరించింది. రైతు ఉద్యమం సమయంలో మరణించిన రైతుల కుటుంబాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్న రీత్యా ఇది ముఖ్యమైన అంశమని స్పష్టం చేసింది. తార్కిక ముగింపు వచ్చేంత వరకూ తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది.

Updated Date - 2023-08-01T04:45:43+05:30 IST