Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. పోలీసుల హడావుడి.. నిర్వాహకుల అసంతృప్తి

ABN , First Publish Date - 2023-09-28T09:47:08+05:30 IST

భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా 12 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. పోలీసుల హడావుడి.. నిర్వాహకుల అసంతృప్తి

హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోంది. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఉదయమే మొదలైంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేష్ చరిత్రలోనే తొలిసారిగా 12 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర మొదలవగా.. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4కు మహాగణపతి చేరుకోనున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు బడా గణేష్ నిమజ్జనం పూర్తికానుంది. ఇక ఆ తరువాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది.


కాగా.. పోలీసుల హడావుడిపై ఉత్సవ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శోభాయాత్రలో భక్తులు భారీగా పాల్గొనకుండానే నిమజ్జన కార్యక్రమం ప్రారంభించడంపై ఉత్సవ నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కు భారీగా గణనాథులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నెంబర్ 4 దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వెను వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.


గతంలో అయితే జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహిస్తున్నారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కూడా ప్రారంభమైంది.

Updated Date - 2023-09-28T09:54:58+05:30 IST