T.Assembly: మూడో రోజు అదే పరిస్థితి.. పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి యత్నం

ABN , First Publish Date - 2023-08-05T11:45:14+05:30 IST

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పలు సంఘాల నేతలు ముట్టడికి యత్నించడం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

T.Assembly: మూడో రోజు అదే పరిస్థితి.. పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి యత్నం

హైదరాబాద్: అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పలు సంఘాల నేతలు ముట్టడికి యత్నించడం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెండింగ్‌లో ఉన్న ఫీస్ రీయింబర్స్‌మెంట్‌పై పీడీఎస్‌యూ, యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న వారిని వచ్చినట్టే అడ్డుకుని అరెస్ట్‌లు చేస్తున్నారు. అయినప్పటికీ ఒకరి తర్వాత ఒకరు అసెంబ్లీకి వస్తుండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమందితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ముందుగా మున్నూరు కాపు సంఘం అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు. మున్నూరు కాపుకు ప్రతేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్నూరు కాపులకు రూ.500 కోట్లు అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.


ఆ వెంటనే యూత్ కాంగ్రెస్ నేతలు రాగా.. వారికి కూడా పోలీసులు అడ్డగించారు. అల్మాస్గూడలో గ్రీన్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ జోన్ ఎత్తివేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ప్రకటించాలని వారు పట్టుబడ్డారు. అసెంబ్లీ ముట్టడించడానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పీడీఎస్‌యూ కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాదిగా వచ్చి పీడీఎస్‌యూ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.5300కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్‌ఈ డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. హాస్టల్ సొంత భవనాలు నిర్మించాలని డీమాండ్ చేశారు. వెంటనే పోలీసులు పీడీఎస్‌యూ సంఘం నేతలను అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-08-05T11:47:59+05:30 IST