Metro Second Phase: రెండోదశ మెట్రో విస్తరణకు రంగంసిద్ధం..!
ABN , First Publish Date - 2023-03-13T11:19:14+05:30 IST
ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ (Metro Airport Corridor) నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ (Metro Airport Corridor) నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయింది. జనరల్ కన్సల్టెంట్ల నియామకం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కేవలం 26 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకునే విధంగా ట్రాక్‌ను పటిష్టంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును నిర్ణీత గడువు మూడేళ్లలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఆ దిశగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మూడు దఫాలుగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (HAML)అధికారులు సర్వే పూర్తి చేశారు. కిలోమీటర్ గుర్తులకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేశారు. అలైన్‌మెంట్‌కు అనుగుణంగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా కారిడార్-3లోని నాగోల్-రాయదుర్గం(Nagole to Raidurg) మార్గానికి అనుసంధానంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamhabad Airport)వరకు పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేస్తామని ప్రకటించింది.
ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ రాయదుర్గం రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద పనులకు భూమి పూజ చేశారు. అదే రోజు తెలంగాణ పోలీస్ అకాడమీ(TSPA)లో జరిగిన బహిరంగ సభలో హెచ్‌ఎండీఏ రూ.625 కోట్లు, జీఎంఆర్ సంస్థ రూ.625 కోట్లు తమ వాటా కింద ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం ప్రభుత్వానికి అందజేసింది.
పకడ్బందీగా ముందుకు..
వాస్తవంగా రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు పక్క నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్‌ను నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ రైట్ ఆఫ్ వే (సరైన మార్గం) తీసుకుంది. ఓఆర్‌ఆర్ నిర్మాణ సమయంలోనే హెచ్‌ఎండీఏ నుంచి రైట్ ఆఫ్ వే తీసుకోవడంతో ప్రస్తుతం ఎయిర్‌పోర్టు పనులకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి లేదు. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 27.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ (ఆకాశమార్గం), 2.5 కిలోమీటర్లు (ఎయిర్‌పోర్టు వద్ద భూగర్భంలో), కిలోమీటర్ (భూమిపై) మెట్రోమార్గం ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. అయితే మూడు రకాల పనులను పూర్తి చేయడంలో హెచ్‌ఏఎంల్ అధికారులు పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. వీటిపై ఇప్పటికే పలు దఫాలుగా అధ్యయనం చేశారు. ప్రధానంగా రహేజా మైండ్ స్పేస్ వద్ద అండర్ పాస్, ఫ్లై ఓవర్ ఉండడంతో పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చిన్న తప్పు జరిగినా మెట్రో రైలు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందనే భావనతో ఒకటికి రెండుసార్లు అలైన్‌మెంట్ మ్యాప్‌ను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ కలిగిన ప్రాంతాలు, ఒకేచోట మూడు కూడళ్లు ఉంటే చేపట్టే నిర్మాణ పద్ధతులపై ఢిల్లీ, చెన్నై మోడల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు.
2-3 కిలోమీటర్లకు స్టేషన్
డీపీఆర్‌లో రహేజా మైండ్ స్పేస్ స్టేషన్ నుంచి ట్రాక్ నిర్మాణం ప్రారంభమైన తర్వాత మొదటి స్టేషన్ బయోడైవర్సిటీ వద్ద రానుంది. తర్వాత ఖాజాగూడ, నానక్‌రామ్‌గూడ జంక్షన్, నార్సింగి, అప్పా, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కార్గో, ఎయిర్‌పోర్టు టర్మినల్ వరకు 4 నుంచి 5 కిలోమీటర్లకు ఒక స్టేషన్ వచ్చే విధంగా రూపొందించారు. ఓఆర్‌ఆర్ వెంట పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఉండడంతోపాటు వందలాది విల్లాలు, వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు ప్రతిపాదించిన స్టేషన్ల మధ్యన అదనంగా 2 నుంచి 3 కిలోమీటర్ల చొప్పున మరికొన్నింటిని ఏర్పాటు చేసే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఆయా ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, చిరువ్యాపారులు మెట్రోను సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.