Jaggareddy: గవర్నర్ బయట పులి.. అసెంబ్లీలో పిల్లి..
ABN , First Publish Date - 2023-02-03T16:14:39+05:30 IST
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రసంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బయట పులిలా గర్జించిన గవర్నర్.. అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన డైరెక్షన్‌లో గవర్నర్ నడిచారని, తప్పని సరి పరిస్థితుల్లో సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య రాజీ కుదిరిందని.. చివరకు తుస్సు మనిపించారన్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే గవర్నర్ నడిచారని జగ్గారెడ్డి విమర్శించారు.
నాందేడ్‌లో సీఎం కేసీఆర్ సభకు భారీ ఏర్పాట్లు
కాగా అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ప్రసంగంపై ప్రభుత్వ వర్గంలో చర్చ జరిగింది. ప్రసంగం చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాపీలోని అంశాలను మాత్రం గవర్నర్ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, విధానాల ప్రస్తావన లేకుండానే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. దీంతో ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
గవర్నర్ ప్రసంగం..
సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం.. కోర్ట్ జోక్యంతో బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానం.. గవర్నర్ ఏం మాట్లాడుతారోనన్న ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ (Telangana Assembly Budget session) సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy), ముఖ్యమంత్రి కేసీఆర్ నమస్కరించి గవర్నర్ తమిళిసైకి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు.
తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజాప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిందని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ గ్రామాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయని హార్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని గవర్నర్ అన్నారు. పచ్చదనంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతోందని, దేశం నివ్వరబోయే అద్భుతాలను తెలంగాణ ఆవిష్కరిస్తోందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగిందన్నారు. ‘‘ వ్యవసాయరంగంలో గొప్ప స్థిరీకరణను తెలంగాణ సాధించింది. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసింది. 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.