Hyderabad: నిమ్స్ ఆస్పత్రికి మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2023-04-13T12:23:19+05:30 IST

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR) గురువారం నిమ్స్ ఆస్పత్రి (Nims Hospital)కి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా చీమలపాడు ప్రమాద బాధితులను పరామర్శించారు.

Hyderabad: నిమ్స్ ఆస్పత్రికి మంత్రి కేటీఆర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR) గురువారం నిమ్స్ ఆస్పత్రి (Nims Hospital)కి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లా చీమలపాడు ప్రమాద బాధితులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థతిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా, చీమలపాడు ఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారన్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

కాగా ఖమ్మం జిల్లా, చీమలపాడులో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నేతలకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు పేల్చిన బాణసంచా పెను విధ్వంసాన్ని సృష్టించింది. ముగ్గురు కార్యకర్తల ప్రాణాలు తీయడంతో పాటు మరికొందరి శరీర అవయవాలను ఛిద్రం చేసింది. అప్పటి వరకూ నేతలకు జై కొడుతూ కార్యకర్తలు చేసిన నినాదాలు, డప్పు చప్పుళ్లతో ఉత్సాహంగా ఉన్న ఆ ప్రాంతమంతా.. క్షతగాత్రుల హాహాకారాలతో, వారి బంధువుల రోదనలతో విషాదమయమైంది. ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన ఈ ఘటన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత నామ నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌తో పాటు పలువురు ముఖ్యనాయకులు బుధవారం ఉదయం చీమలపాడుకు చేరుకున్నారు. కార్యకర్తలు, స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికి వేదికపైకి తీసుకెళ్లారు. ఆ సమయంలో సభాప్రాంగణానికి బయట ఉన్న కార్యకర్తలు.. వేదికకు 300 మీటర్ల దూరంలో బాణసంచా కాల్చడం ప్రారంభించారు. వాటితాలూకూ నిప్పురవ్వలు సమీపంలోని ఓ పూరిగుడిసెపై పడడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కార్యకర్తలతోపాటు స్థానికులు కొందరు తమకు అందుబాటులో ఉన్న తాగునీటి ట్యాంకర్ల సాయంతో మంటలు ఆర్పారు. మంటలు ఆరిపోవడంతో నేతలు సభను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు!

అంతలోనే పెద్ద శబ్దంతో.. గుడిసెలో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. మంటలు ఆర్పేందుకు అక్కడికి చేరుకున్నవారి శరీరాల్లోకి సిలిండర్‌ శకలాలు దూసుకుపోయాయి! కొందరికి కాళ్లు, పాదాలు తెగిపోయాయి. మరికొందరికి తొడలు, పిక్కలు ఛిద్రమయ్యాయి. మాంసపు ముద్దలు గాల్లోకి ఎగిరి చెట్ల కొమ్మలపై పడ్డాయి. పేలుడు ధాటికి పలువురు అల్లంతదూరానికి ఎగిరిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. సిలిండర్‌ శకలాలు దాదాపు అరకిలోమీటరు దూరం దాకా పడ్డాయంటే పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవయవాలు తెగిపడి.. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులు బాధను తట్టుకోలేక చేస్తున్న హాహాకారాలు చేస్తుండడం చూడలేక అక్కడున్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు.. పేలుడు ఘటనతో ఉలిక్కిపడ్డ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, జిల్లా రైతుసమన్వయసమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు, పోలీసులు తమ కాన్వాయ్‌ వాహనాల్లోనే క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి, మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో.. కారేపల్లి మండలం స్టేషన్‌ చీమలపాడుకు చెందిన బానోతు రమేష్‌ (35), చీమలపాడు గ్రామానికి చెందిన అజ్మీర మంగూ (40)అనే కార్యకర్తలు చనిపోయారు. రేలకాయలపల్లికి చెందిన ధర్మసోత్‌ లక్ష్మణ్‌ (53) పరిస్థితి విషమించడంతో ఆయన్ను హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందారు. మరి కొందరు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-04-13T12:23:19+05:30 IST