Telangana; అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం నేడు నామినేషన్ల స్వీకరణ
ABN , First Publish Date - 2023-12-13T08:02:52+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం బుధవారం నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కోసం బుధవారం నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనున్నారు. అయితే గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొత్తగా కొలువుదీరనున్న శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సహజంగా అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతుంటారు. గడ్డం ప్రసాద్ స్పీకర్‌గా నియమితులైతే తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ కానున్నారు. ప్రస్తుత శాసన సభలో అత్యధిక మంది సభ్యులు అగ్రకులాలకు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. సభలో వారికి మాట్లాడే అవకాశం ఇచ్చే, వారిని నియంత్రించే అధికారాలు కలిగిన స్పీకర్ పదవిని దళిత నేతకు ఇస్తున్నామన్న భావనను ప్రజల్లోకి పంపేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు.