Pharma City: ఫార్మా ‘భూమి’రాంగ్
ABN , First Publish Date - 2023-08-05T03:24:08+05:30 IST
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ(Pharma City) భూ సేకరణ(Land acquisition)లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఫార్మా సిటీ భూ సేకరణ, ఇతర ప్రొసీడింగ్స్ కొట్టేస్తూ హైకోర్టు సంచలన తీర్పు
ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ
తాజా మార్కెట్ ధర ప్రకారం సేకరణ మళ్లీ మొదలుపెట్టాలి
ఐఏఎస్‌లకు సైతం చట్టంలోని ప్రాథమికాంశాలు తెలియవా?
కోర్టు కేసుల్లో అధికారులు మరీ గుడ్డిగా వ్యవహరిస్తున్నారు..
వారికి అసలు బాధ్యత ఉందా? బుర్రలు వాడుతున్నారా..?
అధికారులపై మండిపడిన హైకోర్టు
నోటిఫికేషన్ కొనసాగిస్తే రైతులకు నష్టం.. కొట్టేస్తున్నామని వెల్లడిపి
టిషనర్ల అభ్యంతరాలను మూడునెలల్లో పరిష్కరించాలని ఆదేశం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ(Pharma City) భూ సేకరణ(Land acquisition)లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లు, అవార్డులు సహా అన్ని ప్రక్రియలను కొట్టివేస్తూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. తాజా మార్కెట్ ధరల ప్రకారం ఫార్మా సిటీ భూ సేకరణ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) యాచారం మండలం మేడిపల్లి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం 1,702 ఎకరాల భూమి సేకరణలో ప్రభుత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని.. దానిని పూర్తిగా అడ్డుకోవాలంటూ 259.02 ఎకరాలకు చెందిన రైతులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్(Justice M. Sudhir Kumar) ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. భూ సేకరణ చట్టం 2013లోని సెక్షన్ 15(2), 16, 18 తదితరాల్లో పేర్కొన్న నిబంధనలను అధికారులు పాటించలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో భూ సేకరణ నోటిఫికేషన్లు, అవార్డు, ఇతర ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయక తప్పడం లేదని ప్రకటించింది. భూ సేకరణలో తప్పులు సరిదిద్దుకోకుండా.. అధికారులు గుడ్డిగా కోర్టు కేసుల్లో వాదనలు వినిపిస్తున్నారని, వారు సరిగా వ్యవహరించి ఉంటే మూడేళ్ల సమయం వృథా అయ్యేది కాదని తప్పుబట్టింది.
అధికారులపై తీవ్రంగా మండిపాటు
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టిందని తమకు తెలుసని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ, ఐఏఎస్ స్థాయి అధికారులకు భూ సేకరణలో ఏయే విధానాలు పాటించాలో కూడా తెలియడం లేదని మండిపడింది. ‘‘చట్టంలో పేర్కొన్న ప్రాథమిక అంశాలనూ వారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారులు, జిల్లా కలెక్టర్లు భూ సేకరణ ప్రక్రియలో ఏంచేయాలో పూర్తి మార్గదర్శకాలతో రెవెన్యూ శాఖ (జేఏ అండ్ ఎల్ఏ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ 2017లోనే మెమో జారీ చేశారు. దానిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కోర్టులో కేసులు దాఖలైన తర్వాత.. నోటీసులు జారీ అయ్యాక కూడా తప్పులను తెలుసుకోవడం లేదు. ప్రతివాదులైన అధికారులకు అసలు బాధ్యత ఉందా? బుర్రలు ఉపయోగిస్తున్నారా? అని అనుమానం వస్తోంది. తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలకు బదులు కొంత బాధ్యతాయుతంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ విలువైన సమయం వృథా అయ్యేది కాదు.
కోర్టు కేసుల్లో అధికారుల తీరు చూస్తుంటే ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడే, నిర్ణయాలను అమలు చేసే ఉద్దేశం, నిజాయతీ ఉన్నాయా? లేవా? అన్న అనుమానం కలుగుతోంది’’ అంటూ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఫార్మాసిటీ భూ సేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ 2017 జూలైలో జారీ అయిందని.. చట్ట విరుద్ధంగా ఉన్నదాని ప్రకారమే ప్రక్రియ కొనసాగిస్తే అప్పటి ధరల ప్రకారం చెల్లింపులు జరిగి పిటిషనర్లకు చాలా నష్టం వాటిల్లుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 226 కింద ప్రాథమిక నోటిఫికేషన్ సహా అన్ని ప్రొసీడింగ్స్ కొట్టేస్తున్నామని పేర్కొంది. ‘‘భూ సేకరణ ప్రక్రియను తాజాగా ప్రారంభించడానికి ప్రతివాదులకు స్వేచ్ఛ ఇస్తున్నాం. పిటిషనర్ల అభ్యంతరాలను స్వీకరించి మూడు నెలల్లో పరిష్కరించాలి. పరిహారం చెల్లింపులకు చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం మార్కెట్ ధరలను ప్రతివాదులు రివిజన్ చేయాలి. అందుకు ఈ తీర్పు ఇచ్చిన తేదీని ప్రాతిపదికగా తీసుకోవాలి. నిర్వాసిత పిటిషనర్లు సైతం అభ్యంతరాలను తెలియజేసి.. తాజాగా భూ సేకరణకు సహకరించాలని సూచించింది. పరిహారంపై ఇరు పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా చర్చలు జరిపి పరిష్కారానికి రావాలి’’ అని హైకోర్టు పేర్కొంది.
రైతులకు ఊరట.. సర్కారుకు భారీ మూల్యం
భూ సేకరణపై హైకోర్టు ఆదేశాలతో పెరిగిన ధరల ప్రకారం నిర్వాసితులకు లబ్ధి చేకూరనుంది. అయితే, అధికారుల తీరు వల్ల ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టులో దాఖలైన కేసుల్లో రెవెన్యూ శాఖ (ఎల్ఏ అండ్ జేఏ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్అండ్ఆర్ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, భూ సేకరణ అధికారి (ఇబ్రహీంపట్నం ఆర్డీవో), తహసీల్దార్ తదితరులు ప్రతివాదులుగా ఉన్నారు.