TTD Temple: స్థలాన్ని గుర్తించడానికే శ్రద్ధ చూపని టీటీడీ.. ఇవాళ హైదరాబాద్‌లోని ఈ టెంపుల్‌ను చూస్తే..

ABN , First Publish Date - 2023-02-20T11:37:53+05:30 IST

ఏడు కొండల వాడా వేంకటరమణ... ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే..

TTD Temple: స్థలాన్ని గుర్తించడానికే శ్రద్ధ చూపని టీటీడీ.. ఇవాళ హైదరాబాద్‌లోని ఈ టెంపుల్‌ను చూస్తే..

బంజారాహిల్స్‌ (ఆంధ్రజ్యోతి): ఏడు కొండల వాడా వేంకటరమణ... ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా అని ఒక్కసారి తలుచుకుంటే చాలు కొలిచిన వారికి కొంగు బంగారమై సిరులిచ్చే స్వామి వేంకటేశ్వరుడు (Lord Balaji). అందుకే దివ్య మంగళ స్వరూపుడైన ఆయన ఆలయం ఎక్కడ ఉన్నా నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. ఇక తిరుమల (Tirumala) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరుమలలో ఉన్న కాంతిని అన్ని ప్రాంతాలకు ప్రసరించేలా టీటీడీ (TTD) ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా నిర్మించిన జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 98లోని (Jublihills Road No.98) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం (Jublihills TTD Temple) ప్రత్యేకం. తిరుమల సంప్రదాయానికి తీసిపోకుండా... అక్కడి ఆలయ నమూనాలో శ్రీవారి దేవాలయం నిర్మించింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 98లో సుమారు నాలుగు ఎకరాల స్థలం ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు. ఈ స్థలాన్ని గుర్తించడంలో టీటీడీ మొదట శ్రద్ధ చూపించలేదు. కాలనీ వాసులు పూనుకొని టీటీడీ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి స్థలం చూట్టూ ఫెన్సింగ్‌ వేసి కాపాడారు. 2015 ఆగస్టు 10న అప్పటి టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.

రాతితో నిర్మాణం..

3.6 ఎకరాల స్థలంలో మహా గణపతి, అళ్వారు, పద్మావతి అమ్మవార్ల సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఇందుకు టీటీడీ 32 కోట్ల రూపాయలు కేటాయించింది. కొండ ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో రాయితో నిర్మాణం చేస్తే బాగుంటుందని భావించారు. ఈ మేరకు టీటీడీ స్థపతి, కాంట్రాక్టర్‌తో చర్చించారు. గతంలో అనేక ఆలయాలు నిర్మించిన అనుభవం ఉన్న స్థపతి నటరాజన్‌ ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమించారు. తమిళనాడు నామకల్‌ నుంచి రాయిని తెప్పించి దానిపై నిర్మాణం చేపట్టారు. ఆలయ ప్రహరీ, అంతరాలయ నిర్మాణాలన్ని రాతితో చేసి గోపురం మాత్రం కాంక్రీట్‌తో ఏర్పాటు చేశారు.

అన్నీ ప్రత్యేకతలే..

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఆలయ సమూహంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం ఎదుట యాభై అడుగుల రాజగోపురం ఏర్పాటు చేస్తున్నారు. 30 అడుగుల వరకు రాయి ఆపై కాంక్రీట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. రాజగోపురం, ఆలయ గోపురం, అంతర్భాగంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. శిల్పాలను అమర్చారు. మరో వైపు భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పుష్కరిణిని ఏర్పాటు చేశారు.

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

జూబ్లీహిల్స్‌లో గల టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 19న అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 20న ధ్వజారోహణం, 24న గరుడసేవ, 27న రథోత్సవం, 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

Updated Date - 2023-02-20T11:40:57+05:30 IST