V. Hanumantha Rao: 20 ఏళ్ల తర్వాత ఇంత ఘోర రైలు ప్రమాదం చూడలేదు

ABN , First Publish Date - 2023-06-03T14:46:58+05:30 IST

20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాంధీభవన్‌‌లో

V. Hanumantha Rao: 20 ఏళ్ల తర్వాత ఇంత ఘోర రైలు ప్రమాదం చూడలేదు
V. Hanumantha Rao

హైదరాబాద్: 20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాంధీభవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలను అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతూ రైతు రాజ్యం అంటున్నారు. కేసీఆర్ ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే వారికి సంకెళ్లు వేశారు. రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర కేసీఆర్‌కు దక్కుతుంది. తెలంగాణలో ఉన్న వారికి పరిహారం ఇవ్వకుండా పంజాబ్, బీహార్ వాళ్లకు ఇచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. పేద ప్రజలపై మోదీకి ప్రేమ లేదు. బండారు దత్తాత్రేయ తెలంగాణ కోసం పోరాడితే.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేంద్రం ఎందుకు పిలవలేదు. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేసీఆర్ బీసీ బంధు అని బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని దుయ్యబట్టారు.

‘‘వచ్చే ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి. మాటలు చెప్పే మోదీ, కేసీఆర్‌ను ఓడించాలి. అనేకమంది పిల్లలు ఐఐటీ, ఐఐఎం చదవడానికి కాంగ్రెస్సే కారణం. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటి...? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశాం. 1993లో మండల్ కమీషన్ వచ్చినా ఇప్పటికీ అమలు కావడం లేదు. కాంగ్రెస్‌లో ఎవరైనా చేరవచ్చు కానీ ఐదేళ్ల వరకు పదవులు ఇవ్వొద్దు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో చెప్పారు. ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తే ప్రభావం ఉంటుంది.’’ అని వీహెచ్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2023-06-03T14:46:58+05:30 IST