Ration dealers: రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు
ABN , First Publish Date - 2023-08-08T15:57:42+05:30 IST
రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్ల కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: రేషన్ డీలర్లకు (Ration Dealers) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీపికబురును అందించింది. రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్ల కమీషన్‌ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గతకొద్దిరోజులుగా తమ సమస్యలపై రేషన్ డీలర్లు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు రేషన్ డీలర్ల సంఘాలతో మంగళవారం సచివాలయంలో మంత్రులు హరీష్ రావు (Minister Harish Rao), గంగుల కమలాకర్ (Minister Ganula Karunakar) నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్ల కమీషన్‌ను ఏకంగా ఏడు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటు నుంచి రూ.200లుగా ఉన్న కమీషన్ రూ.1400కు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా అదనంగా రూ.139 కోట్లు కేటాయించనుంది. అలాగే కరోనాలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీమా, వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ రెన్యూవల్ ఐదేళ్లకు పెంపు, రేషన్ భవన్, అంత్యక్రియల సాయం తదితర 13 ప్రధాన అంశాలకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది. పేదల సంక్షేమం, రేషన్ డీలర్ల సంక్షేమంలో తెలంగాణ తిరుగులేదని మరోసారి నిరూపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సొంతంగా 91 లక్షల పేదలకు ఆహార ధాన్యాల సరఫరా చేస్తోంది. కేంద్రం కేటాయింపులు పెంచకున్నప్పటికీ వాటిని తెలంగాణ సర్కార్ అందిస్తోంది. కమీషన్‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలియజేసింది.