Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారు
ABN , First Publish Date - 2023-03-10T12:54:51+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ (Inauguration of the new Secretariat) తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం నూతన సచివాలయానికి వచ్చిన సీఎం... అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం సచివాలయం ప్రారంభోత్సవ తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరుగనుంది. అలాగే జూన్ 2న అమరవీరుల చిహ్నం ఆవిష్కరణ జరుగనుంది. అలాగే రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు.
కాగా... పాత సచివాలయాన్ని కూల్చి వేసి దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టారు. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. సచివాలయం పనులు దాదాపు పూర్తి అయ్యాయి.
అయితే నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ప్రభుత్వం ముందు భావించింది. అయితే అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవం మొదటిసారి వాయిదా పడింది. ఆ తరువాత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ కారణంగా రెండో సారి ప్రారంభోత్సవం వాయిదా పడింది.