Hyderabad: పోలీసులను పరుగులు పెట్టించిన చిల్లర దొంగ..
ABN , First Publish Date - 2023-10-27T08:08:55+05:30 IST
హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్‌ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్‌ను గుర్తించారు.
హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్‌ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్‌ను గుర్తించారు. వివరాల్లోకి వెళితే... చాంద్రాయణ గుట్టలోని సీఆర్పీఎఫ్ 95 బెటాలియన్‌కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు ఈనెల 24న రైల్వే స్టేషన్‌కు వచ్చారు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు వేచి ఉన్న సమయంలో ఆయుధాల బ్యాగ్‌ను దొంగ అపహరించాడు. తర్వాత గమనించిన కానిస్టేబుళ్లు.. జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ బ్యాగ్‌లో 60 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు ఉన్నాయి. జీఆర్పీతో పాటు రైల్వే రక్షకదలానికి చెందిన ఎనిమిది బృందాలు దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. చిల్లర దొంగ శ్రీకాకుళానికి చెందిన ఆనందమూర్తిగా పోలీసులు గుర్తించారు. గాంధీనగర్ మెట్రో స్టేషన్ వద్ద దొంగను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బ్యాగ్‌లో ఆయుధాలు ఉండడంతో గాంధీనగర్ మెట్రో పిల్లర్ వద్ద పడేశానని చెప్పాడు. మెట్రో పిల్లర్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వృద్ధుడు తీసుకెళ్లినట్టు గుర్తించారు. ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న వృద్ధుడు సత్యనారాయణ వద్ద ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారు.