TSPSC Leakage: ఈడీ ఆఫీసుకు రాని శంకర లక్ష్మి, సత్యనారాయణ... కొనసాగుతున్న సస్పెన్స్
ABN , First Publish Date - 2023-04-12T12:50:54+05:30 IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో (TSPSC Paper Leakage Case) ఈడీ (ED) దూకుడు పెంచింది. ఈ కేసులో కస్టోడియన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి, అడ్మిన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు పది గంటలకు విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఇంత వరకు శంకర్ లక్ష్మి, సత్యనారాయణ ఈడీ కార్యాలయానికి హాజరుకాలేదు. ఈ ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఈడీ విచారణకు హాజరవుతారా.. లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. శంకర్ లక్ష్మి ఇప్పటికే సిట్ ముందు మూడు సార్లు హాజరై స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే సిట్ అధికారులకు సహకరించిన శంకర లక్ష్మి... ఈడీ అధికారులకు సహకరిస్తుందా లేదా అన్న అనుమానం నెలకొంది. ఇప్పటికే పేపర్ లీకేజీ వ్యవహారంపై బేగంబజార్ పోలీసులు, సిట్ అధికారులు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా పేపర్ లీకేజీ కేసులో ఈడీ ఎంటరై.. విచారణను వేగవంతం చేసింది. పేపర్ లీకేజీ అంశంలో ఫిర్యాదుదారుడిగా సత్యనారాయణ, సాక్షిగా శంకర్ లక్ష్మి ఉన్నారు. ఇద్దరినీ విచారించిన అనంతరం మరికొందరిని విచారించాలని ఈడీ భావించింది. అయితే ఇప్పటివరకు ఇద్దరు కూడా ఈడీ అధికారుల ముందు హాజరుకాని పరిస్థితి. టీఎస్పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంపై ఈడి ఈసీఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.