Telangana: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు వెనుక ఉన్న వ్యక్తి ఎవరంటే..
ABN , Publish Date - Dec 18 , 2023 | 09:16 AM
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుంటే.. ఆయనను సొంత నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతలను తన అన్న తిరుపతి రెడ్డి బుజాన వేసుకున్నారు. 2018లో రేవంత్‌ను ఓడించి తొడగట్టిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చి మీసం మెలేసేలా చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకుంటే.. ఆయనను సొంత నియోజకవర్గంలో గెలిపించే బాధ్యతలను తన అన్న తిరుపతి రెడ్డి బుజాన వేసుకున్నారు. 2018లో రేవంత్‌ను ఓడించి తొడగట్టిన బీఆర్ఎస్‌కు మొన్నటి ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చి మీసం మెలేసేలా చేశారు. ఇంటగెలిస్తేనే రచ్చ గెలువచ్చని భావించిన రేవంత్ అంత ధీమాగా రాష్ట్రమంతా పర్యటించడానికి కొడంగల్‌లో పన్నిన వ్యూహం ఏంటి? బీఆర్ఎస్‌ను ఎలా బోల్తా కొట్టించారు..
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కష్టాల్లో ఉన్న పార్టీని ముందుకు నడిపించిన నాయకుడే.. ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డారో.. కొడంగల్‌లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచేందుకు రేవంత్ రెడ్డి అన్న కూడా అంతే కష్టపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ఓ వైపు కేసీఆర్, మరోవైపు హరీష్ రావు అనేక వ్యూహాలను పన్నారు. అయితే ఆ వ్యూహాలను గట్టిగా తిప్పికొట్టి.. తన సోదరుడు రేవంత్ రెడ్డిని గెలిపించాడు. తిరిపతి రెడ్డి. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి గెలుపు విషయంలో అన్న తిరుపతి రెడ్డి కీలక భూమిక పోషించారు. పద్మవ్యూహంలో చిక్కుకున్న కొడంగల్‌లో కాంగ్రెస్ జెండాను ఎగరేశారు. కేసీఆర్ ప్రధాన టార్గెట్ రేవంత్ రెడ్డే కావడంతో ఆయన ఓటమికి బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించిన బీఆర్ఎస్ ఈ సారి కూడా సేం ఫార్ములాను అమలు చేసింది.. కానీ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దూకుడు ముందు బీఆర్ఎస్ చతికిల పడాల్సి వచ్చింది..
కొడంగల్‌లో రేవంత్ రెడ్డి విజయం వెనుక ఆయన అన్న తిరుపతి రెడ్డి తీవ్రంగా శ్రమించారు. వాస్తవానికి బీఆర్ఎస్ పైన ఆయన అనేక సందర్భాల్లో ఎదురు దాడికి దిగారు. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తుండగా.. కొడంగల్‌ను మాత్రం తిరుపతి రెడ్డి అన్నీతానై చూసుకున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచే ఊరూ వాడా కలియ తిరిగారు తిరుపతి రెడ్డి. కొడంగల్ నుంచి హైదరాబాద్, ముంబై, పూనేకు వలస వెళ్లిన కార్మికుల కోసం ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి మరీ వారితో ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాదు ఎన్నికలకు ఒక రోజు ముందే వీరిని కొడంగల్ రప్పించి మరీ వారితో ఓట్లేయించారు. ఒకవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి మీద అధికార పార్టీ ఎంత నిఘాపెట్టిందో, కొడంగల్‌లో తిరుపతి మీద కూడా అంతే నిఘా ఉంచింది. ఆయన ప్రతి అడుగును గమనించింది. అయినా.. వాటన్నింటినీ తట్టుకుని తమ్మడు రేవంత్ రెడ్డి విజయంలో తిరుపతి రెడ్డి కీలక పాత్ర పోషించి సక్సెస్ అయ్యారు.
2018లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓడిన తర్వాత ఆయన మల్కాజ్‌గిరీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయినప్పటికీ.. కొడంగల్‌ను మాత్రం విడిచిపెట్టకుండా అక్కడి నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ బాధ్యతలను తిరుపతిరెడ్డి కూడా సక్రమంగా నిర్వర్తించడంతో ఈ సారి విజయం సాధించగలిగారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్‌కు కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చి వెళ్లినా.. ఆయన మంచి మెజార్టీతో గెలిచారంటే దాని వెనుక తిరుపతి రెడ్డి ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గెలిస్తే.. సీఎం అవుతారంటూ గట్టిగా జనంలోకి తీసుకెళ్లడం, కొడంగల్‌లో బీఆర్ఎస్ అరచకాలను ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మలుచుకోవడం రేవంత్ రెడ్డి గెలుపులో కీలక పాత్రగా మారాయి. తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డిల తమ్ముడు కృష్ణారెడ్డి కూడా కొడంగల్‌లో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో రేవంత్ రెడ్డి గెలుపులో సోదరులు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కడంతో ప్రస్తుతం కొడంగల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ ప్లేస్‌గా మారింది.