YS Sharmila: ‘దొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ?’
ABN , First Publish Date - 2023-04-15T13:14:29+05:30 IST
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగిని కాళ్లతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగిని కాళ్లతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘దొర గారూ.. ఇదేనా ఆరోగ్య తెలంగాణ?. రోగులను నేలపై లాక్కొని పోవడం కార్పొరేట్ వైద్యమా?. స్ట్రెచర్లు, వీల్ చైర్లు లేకపోవడమే వసతుల కల్పనా?. ఏటా 11వేల కోట్ల బడ్జెట్ అంటూనే.. రోగికి వీల్ చైర్ కూడా అందించలేని దరిద్రపు పాలన. ఇది మీరు చెప్తున్న ఆరోగ్య తెలంగాణ కాదు.. ప్రజలు చూస్తున్న "అనారోగ్య తెలంగాణ"’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
కాగా... నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఓ రోగిని బంధువులు కాళ్లు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోగిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లని ఆస్పత్రి సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వాస్పత్రిపై వస్తున్న వార్తలను ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ ఖండించారు. ఆస్పత్రికి వచ్చిన రోగికి చికిత్స అందించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. రోగిని వైద్య పరీక్షల కోసం రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు. పేషేంట్ కేర్ సిబ్బంది వీల్ చైర్ తీసుకొచ్చేలోపే లిఫ్ట్ వచ్చిందని వారి తల్లిదండ్రులు రోగిని లాగుతూ తీసుకెళ్లారని చెప్పారు. దీన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది రోగి బంధువులను వారించి... రెండో అంతస్తులో పూర్తి వసతులతో డాక్టరుకు చూపించారన్నారు. ఇదంతా తెలియని ఓ వ్యక్తి వీడియో తీసి వైరల్ చేశారని తెలిపారు. ఈ సంఘటనకు, ప్రభుత్వ ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ స్పష్టం చేశారు.