Chikoti Praveen: థాయ్‌లాండ్ గ్యాంబ్లింగ్ కేసులో విచారణ వేగవంతం
ABN , First Publish Date - 2023-05-02T12:50:10+05:30 IST
థాయ్‌లాండ్ (Thailand) గ్యాంబ్లింగ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో 93 మందిని థాయ్‌లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: థాయ్‌లాండ్ (Thailand) గ్యాంబ్లింగ్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో 93 మందిని థాయ్‌లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen) థాయ్‌లాండ్‌లో అరెస్టయ్యారు. బాంగ్ లాముంగ్ జిల్లాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో ఓ 4-స్టార్ హోటల్‌లో క్యాసినో, జూదం నిర్వహిస్తుండగా.. ఉప్పందుకున్న థాయ్‌లాండ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ (Special operation) చేపట్టి.. చీకోటి ప్రవీణ్, అతని అనుచరుడు మాధవరెడ్డి, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహా 87 మంది భారతీయులను అరెస్టు చేశారు. ఇతర దేశాలకు చెందిన వారితో కలిపి మొత్తం 100 మందికి పైగా అరెస్టు చేయగా.. వీరిలో 19 మంది యువతులున్నారు. మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన వీఆర్‌ఏ వాసు, ఇసుక వ్యాపారి సాగర్, వ్యాపారవేత్తలు సుదర్శన్ రెడ్డి, భరత్ రెడ్డి, మల్లికార్జున్ రావు, మాధవరెడ్డి, బిల్డర్ మధు, వర్మ, తిరుమల్ రావు, బొమ్మిడి మధుసూదన్ అరెస్టయిన వారిలో ఉన్నారు.
వీఆర్‌ఏ వాసుపై కేసు నమోదు కావడంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. థాయ్‌లాండ్‌లో ఏప్రిల్ నెలలో రెండుసార్లు చికోటి ప్రవీణ్ ఈవెంట్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏప్రిల్ 11 నుంచి 16 వరకు గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రెండోసారి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గ్యాంబ్లింగ్‌పై థాయ్‌లాండ్ ఇంటెలిజెన్స్‌కు గోవాకు చెందిన వ్యక్తి సమాచారమిచ్చాడు. పక్కా సమాచారంతో ఏషియా హోటల్‌పై థాయ్ పోలీసులు దాడి చేశారు. ఈవెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి చికోటి రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంబ్లింగ్ నిర్వహణలో మహిళ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
అరెస్టయిన భారతీయుల్లో తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖుల అనుచరులు, వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. థాయ్‌లాండ్‌లో క్యాసినో, జూదంపై నిషేధం లేదని చీకోటి ప్రవీణ్ నమ్మబలకడంతో వీరంతా రానుపోను విమాన టికెట్లు కాకుండా.. ఒక్కొక్కరు రూ. 3 లక్షలు చెల్లించి, థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. భారత్‌లో డబ్బులు చెల్లిస్తే థాయ్‌లాండ్‌లో వాటికి సమాన విలువ గల చిప్స్ ఇచ్చేలా.. ఆ తర్వాత క్యాసినో, జూదంలో గెలుపొందిన వారి నగదును భారత్‌లో భద్రంగా అప్పగించేలా చీకోటి ప్రవీణ్‌తో ఒప్పందం ఉండడంతో వీరంతా థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలిసింది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో నేపాల్‌లో క్యాసినో నిర్వహించనున్నట్లు ఇప్పటికే చీకోటి గ్యాంగ్ ప్రచారం చేసుకున్నట్లు తెలిసింది. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌కు ఉపయోగించిన పరికరాలన్నీ భారత్ నుంచి దిగుమతి చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. నిజానికి గత నెల 24న కూడా ఓ భారతీయ బృందం హోటల్‌లో దిగిందని, వారంతా సైట్‌సీయింగ్‌కు వచ్చారని, 27న వచ్చిన బృందం మాత్రం క్యాసినో ఆడేందుకు వచ్చిందని సమాచారం.