TS Assembly Polls : తుమ్మల.. గోదావరి జలాలతో ఎవరి కాళ్లు కడుగుతారు..!?
ABN , First Publish Date - 2023-10-26T12:15:58+05:30 IST
గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానన్న పెద్దమనిషి ఖమ్మం ఎందుకు వచ్చారు?’ అని రవాణాశాఖ మంత్రి, ఖమ్మం
- పాలేరు ప్రజలకు హామీ ఇచ్చి ఖమ్మం ఎందుకొచ్చావో చెప్పాలి
- పోలీసులను ఉరికిస్తాననటం సిగ్గుచేటు
ఖమ్మం: ‘గోదావరి జలాలతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానన్న పెద్దమనిషి ఖమ్మం ఎందుకు వచ్చారు?’ అని రవాణాశాఖ మంత్రి, ఖమ్మం బీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్(Puvvada Ajay Kumar) మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao)ను ప్రశ్నించారు. ఖమ్మం నగరంలోని నెహ్రూనగర్‌లో ప్రముఖ న్యాయవాది మల్లాది వాసుదేవరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం, ఖానాపురం హవేలీ పరిధిలో జరిగిన బూత్‌లెవల్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అహంకారానికి, అభివృద్ధికి మధ్య యుద్ధం జరుగుతోందని, అంతిమంగా అభివృద్ధిదే విజయమన్నారు. తన దగ్గర ఉన్నవాళ్లు రౌడీలు, దొంగలు అని అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ తన వద్ద ఉండేవారంతా నిరంతరం పేదల అభ్యున్నతి కోనం పనిచేసేవారని, తుమ్మల దగ్గర ఉన్నవాళ్లు పత్తిత్తులా? అని ప్రశ్నించారు. డీసీసీబీని నట్టేట ముంచి, నిలువునా దోచుకున్నవారు, ప్రజల ఆస్తులను కబ్జా చేసినవారు, రౌడీషీటర్లు ఆయన వెంటే ఉన్నారని మంత్రి అజయ్ దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను తుమ్మల నియంత్రిస్తారా, వారి విధులను కూడా నిర్ణయిస్తారా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పొలీసులను జీపుల ముందు ఉరికిస్తానని చెప్పటం సిగ్గు చేటన్నారు. పదవుల్లో ఉన్నప్పుడు పేదల గుడిసెలు తొలగించి వారిని నిరాశ్రయులను చేశారని, కానీ తాను పేదలకు గూడు కల్పించి హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం అభివృద్ధి కోసమేనని, ప్రతీకారాలు తీర్చుకోవటానికి కాదన్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు ప్రవర్తిస్తున్న వారికి త్వరలోనే ప్రజలు బుద్ధిచెప్పటం ఖాయమన్నారు. తనను ఖాసింరజ్వీతో పోల్చటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, బీఆర్‌ఎస్ తుమ్మలకు ఎంతో చేసిందని, కానీ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేలా ఆయన ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల్లో రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరెడ్డి, ముత్తయ్య, కొండల్‌రావు, మేకల భిక్షమయ్య, వేములపల్లి వేంకటేశ్వరరావు, తవిడిశెట్లి హనుమంతరావు, పోట్ల శ్రీకాంత్, మాటూరి లక్ష్మీనారాయణ, వల్లభనేని రామారావు, డీసీసీబీ, డీసీఎంస్, సుడా చైర్మన్లు కూరాకుల నాభూషయ్య, రాయల శేషగిరిరావు, బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, దండా జ్యోతిరెడ్డి, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, సరిపూడి సతీష్, తదితరులు పాల్గొన్నారు.