Komati Reddy Venkata Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చెప్పు విసిరిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త

ABN , First Publish Date - 2023-02-16T18:55:59+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో ఉండే సహజ స్వేచ్ఛను వినియోగించుకుని నేతలు తమదైన శైలిలో వారివారి నియోజకవర్గాల్లో జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...

Komati Reddy Venkata Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చెప్పు విసిరిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త

నల్లగొండ: కాంగ్రెస్‌ పార్టీలో ఉండే సహజ స్వేచ్ఛను వినియోగించుకుని నేతలు తమదైన శైలిలో వారివారి నియోజకవర్గాల్లో జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkata Reddy) ఉమ్మడి నల్లగొండతో పాటు దక్షిణ తెలంగాణ (South Telangana)లోని పలు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన శాలిగౌరారం మండలంలో ఇటుకులపాడులో పర్యటించారు. ఈ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోమటిరెడ్డి పర్యటనను బీఆర్‌ఎస్‌ (BRS) శ్రేణులు అడ్డుకున్నాయి. ఎంపీ పర్యటనను అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీంతో కాంగ్రెస్‌ (Congress), బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్త చెప్పు విసిరారు. ఆగ్రహంతో ఊగిపోయిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆ వెంటనే అక్కడి నుంచి కోమటిరెడ్డి వెళ్లిపోయారు.

నెలాఖరులో వెంకట్‌రెడ్డి యాత్ర

ఎంపీ వెంకట్‌రెడ్డి పొంతనలేని ప్రకటనలు చేస్తుండటంతో ఆయన అనుచరులు అయోమయంలో ఉన్నారు. అయితే వెంకట్‌రెడ్డి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో యాత్ర నిర్వహిస్తారనేది తేలగా, అది బైకు, బస్సు యాత్రా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో వెంకట్‌రెడ్డి యాత్ర ప్రారంభించనున్నారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి గుట్ట నుంచి యాత్ర ప్రారంభించి ఆలేరు, జనగాం, సూర్యాపేట, నకిరేకల్‌, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో పర్యటించేందుకు ప్రాథమికంగా రూట్‌ప్లాన్‌ ఖరారుచేసినట్టు తెలిసింది. అయితే ఈ యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు వెంకట్‌రెడ్డి తన అనుచరులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. స్థానికంగా పనిచేసుకుంటున్న దుబ్బాక నర్సింహారెడ్డి సైతం జోడో యాత్ర ప్రారంభించలేదు. మొత్తంగా నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతలు అయోమయంలో ఉన్నారు.

జోడోతో జనంలోకి

రాహుల్‌గాంధీ (Rahul Gandhi) దేశా వ్యాప్తంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు అనుబంధంగా హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రను టీపీసీసీ చేపట్టింది. ఈ నెల 6వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మొత్తం రెండు నెలల పాటు అన్ని నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ప్రతీ ఇంటికి కాంగ్రెస్‌ స్టిక్కర్‌ అంటించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.

Updated Date - 2023-02-16T18:56:00+05:30 IST