Share News

KTR: ఇటు కాప్రా.. అటు పెద్ద అంబర్‌పేట్ వరకు మెట్రో..

ABN , First Publish Date - 2023-11-21T08:59:37+05:30 IST

వచ్చే టర్మ్‌లో ఇటు ఈసీఐఎల్‌, కాప్రా.. అటు పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోను తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్‌(Minister KTR) అన్నారు.

KTR: ఇటు కాప్రా.. అటు పెద్ద అంబర్‌పేట్ వరకు మెట్రో..

- స్కైవాక్‌, ఫ్లైఓవర్లతో ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌లలో భారీ అభివృద్ధి ఫ కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు..

- మూసీ సుందరీకరణ జరగాలన్నా.. ఐటీ కంపెనీలు రావాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యం

- ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ కార్నర్‌ మీటింగ్‌లలో కేటీఆర్‌

హైదరాబాద్‌సిటీ, (ఆంధ్రజ్యోతి): వచ్చే టర్మ్‌లో ఇటు ఈసీఐఎల్‌, కాప్రా.. అటు పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోను తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్‌(Minister KTR) అన్నారు. సోమవారం రాత్రి ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌లలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌, రోడ్‌షోలలో మాట్లాడారు. ఉప్పల్‌ చౌరస్తాలో మాట్లాడుతూ మూసీ సుందరీకరణ జరగాలన్నా.. ఐటీ కంపెనీలు రావాలన్నా.. అల్లాటప్పా నాయకులతో సాధ్యం కాదని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉప్పల్‌లో స్కైవాక్‌, ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉందన్నారు. ఉప్పల్‌ పారిశ్రామిక వాడలో 24గంటల కరెంట్‌తో కార్మికులకు సంపూర్ణ ఉపాధి దొరుకుతుందన్నారు. కళ్లముందు కనపడే అభివృద్ధిని చూసి ఓట్లువేయాలన్నారు. ఉప్పల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు.

అభ్యర్థి లేకుండానే..

అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వేదికపై లేకుండానే కేటీఆర్‌ ప్రసంగించారు. మిర్యాలగూడ నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో కేటీఆర్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో ఉప్పల్‌ నుంచి అటు తార్నాక, ఇటు నాగోల్‌ వైపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వాస్తవంగా రోడ్‌ షో కోసం ఏర్పాటు చేసిన వాహనంలో కేటీఆర్‌ ఎక్కాల్సి ఉండగా.. జనసమీకరణ ఎక్కువగా ఉండడంతో ఆయన వాహనాన్ని పోలీసులు నేరుగా వేదిక వద్దకు పంపించారు. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి రోడ్‌ షో వాహనంలో ఉండిపోయారు. ఆ వాహనం యూ టర్న్‌ తీసుకొని వేదిక వద్దకు వచ్చేలోపే కేటీఆర్‌ మూడు, నాలుగు నిమిషాలు మాట్లాడి ఎల్‌బీనగర్‌కు వెళ్లిపోయారు. అభ్యర్థి ఎక్కడంటూ పలుమార్లు కేటీఆర్‌ అడిగినా.. ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకున్న లక్ష్మారెడ్డి వేదిక వద్దకు రాలేకపోయారు.

CITY1.jpg

118 జీవోతో 20వేల కుటుంబాలకు న్యాయం..

ఎల్‌బీనగర్‌ మన్సురాబాద్‌, వనస్థలిపురం, హస్తినాపురం డివిజన్‌ నందనవనంలలో నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 118 జీవో తెచ్చి సుమారు 42 కాలనీల్లో 20 వేల కుటుంబాలకు న్యాయం చేశామన్నారు. ఎల్‌బీనగర్‌ చౌరస్తా ఎలా అయ్యిందో చూస్తున్నామని, మెట్రోను నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌, అక్కడి నుంచి పెద్ద అంబర్‌పేట్‌ వరకు విస్తరించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి మరింత అభివృద్ది చేస్తామన్నారు. హైద్రాబాద్‌లో లా అండ్‌ ఆర్డర్‌ బాగుండడంతోనే మనకు పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇక్కడి ప్రతిపక్ష నాయకులు కళ్లుండి చూడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రియమైన ప్రధానమంత్రి అని ఎవ్వరూ అనడం లేదని.. పిరమైన ప్రధానమంత్రి అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎల్‌బీనగర్‌ నుంచి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-21T08:59:39+05:30 IST