Jupalli Krishnarao: ఎన్నికల తర్వాత దళితబందు మూలకే
ABN , First Publish Date - 2023-08-23T15:36:40+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, దుర్మార్గపాలన జరుగుతోందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, దుర్మార్గపాలన జరుగుతోందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupalli Krishna Rao) అన్నారు. బుధవారం జిల్లాలోని చిన్నంబావి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జూపల్లి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం స్కింలు పెడుతున్నారని.. ఎన్నికల తర్వాత దళిత బంధు మూలకుపడుతుందన్నారు. 9 ఏండ్లు డబుల్ బెడ్ రూంల గురించి మాట్లాడాలేదని.. ఇప్పుడు ఎన్నికల ముందు గృహలక్ష్మి పథకం తీసుకొచ్చారని మండిపడ్డారు. 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశారని... కానీ ప్రజలకు జరిగింది ఏమిటని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ (CM KCR) అప్పుల రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లు ఆంధ్రోళ్లు అన్నారని.. తెలంగాణ వచ్చాక వేల, లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. ప్రభుత్య ఆదాయాన్ని అక్రమంగా సంపాదించి, నాయకులను కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ గెలిచిన మూడు నెలలకే అమ్ముడుపోయి, పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.