ITC: మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ఏర్పాటు
ABN , First Publish Date - 2023-01-30T19:48:54+05:30 IST
ఐటీసీ(ITC) మెదక్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్
హైదరాబాద్: ఐటీసీ(ITC) మెదక్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. 59 ఎకరాల విస్తీర్ణంలో 6.5 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నిర్మించారు. మొదటి దశలో రూ. 450 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఫలితంగా భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఐటీసీ ప్రపంచశ్రేణి ఫుడ్ బ్రాండ్లు అయిన ఆశీర్వాద్ ఆటా(Aashirvaad Atta), సన్‌ఫీస్ట్ బిస్కెట్లు(Sunfeast Biscuits), బింగో చిప్స్(Bingo Chips), ఇప్పీ నూడిల్స్(Yippee Noodles) వంటి వాటిని ఇక్కడ దశల వారీగా ఉత్పత్తి చేయనున్నారు.
ఈ ఫెసిలిటీని శాస్త్రీయంగా డిజైన్ చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఉండడం వల్ల భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఫ్యాక్టరీలో 50 శాతం మంది మహిళలు విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ లిమిటెడ్ చైర్మన్ సంజీవ్‌పురి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాడు, ఇక్కడ ఉన్న అవకాశాలతో తాము మెదక్‌లో ప్రపంచశ్రేణి ఇంటిగ్రేటెడ్ ఫుడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ ఫెసిలిటీలో పెట్టుబడులు పెట్టామన్నారు. తద్వారా వ్యవసాయ, తయారీ, సేవల రంగాలకు అసాధారణ తోడ్పాటు లభిస్తుందన్నారు.
తెలంగాణలో ఐటీసీ రెండు అతిపెద్ద పేపర్ తయారీ కేంద్రాలు భద్రాచలం, బొల్లారంలో ఉన్నాయి. రాష్ట్రంలో పేపర్‌బోర్డ్స్ తయారీని వేగవంతం చేసేందుకు ఐటీసీ ఇంటిగ్రేటెడ్ యూనిట్ భద్రాచలంలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో నూతన బాయిలర్ సాంకేతికతను ఏర్పాటుచేసింది. ఫలితంగా బొగ్గుపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.