TS News: మతాలు వేరని పెళ్లి వద్దన్నారు... ఆ ప్రేమ జంట చేసిన పనికి...
ABN , First Publish Date - 2023-02-16T09:52:00+05:30 IST
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు.
మెదక్: ప్రేమ (Love) ఎప్పుడు, ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు. ప్రేమకు కుల, మత, పేద, ధనిక అనే బేదం ఉండదు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం ఉండదు. అయితే ప్రేమలో పడిన జంటలు ఎన్నో అవాంతరాలకు ఎదుర్కుంటేనే గాని ఒక్కటయ్యే పరిస్థితి కనబడం లేదు. వారి పెళ్లికి మతం, కులం అంటూ ఎన్నో అడ్డుపడుతుంటాయి. వాటిని అధిగమించి కొన్ని జంటలు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంటే.. కొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో తమ ప్రాణాలనే విడుస్తున్నారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లా (Medak District)లో చోటుచేసుకుంది.
ఇటీవల నార్సింగి (Narsingh)లో అదృశ్యమైన ఓ ప్రేమ జంట (Lover Couple) కథ విషాదాంతంగా ముగిసింది. స్థానికంగా ఉంటున్న కల్పన, ఖలీల్ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డుతగిలారు. పెళ్లి చేసేందుకు నిరాకరించారు. కారణం ఇరువురి మతం వేరు కావడమే. కల్పన తల్లిదండ్రులు ఓ అడుగు ముందుకేసి రెండు నెలల క్రితం ఆమెకు వేరొకరితో వివాహం జరిపించారు. తీవ్ర మనస్థాపానికి గురైన కల్పన తన ప్రియుడు ఖలీల్‌తో కలిసి నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తాము కలిసి జీవించలేమని.. అందుకు పెద్దలు అంగీకరించని భావించిన ఈ జంట ఒక్కటిగానే ప్రాణాలు విడిచింది. ప్రేమజంట కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలించగా... నార్సింగి చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇరువురి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.