Harish Rao: త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల..
ABN , First Publish Date - 2023-09-27T14:42:27+05:30 IST
మెదక్ జిల్లా: మంత్రి హరీష్ రావు బుధవారం తూప్రాన్, మనోహరబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా తూప్రాన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారని...
మెదక్ జిల్లా: మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) బుధవారం తూప్రాన్, మనోహరబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా తూప్రాన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని (Konda Laxman Bapuji Statue) ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో (BRS Manifesto)ను విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త (Good News) త్వరలోనే వింటారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, కేసీఆర్‌కు ముందు, ఆయన వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో మీరే బేరీజు వేసుకోవాలన్నారు. ఇంత పురోగతి కనిపిస్తున్నా ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అంటున్నారన్నారు. తూప్రాన్ అభివృద్ధి కాలేదంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టేనని.. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేమని అన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని, తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా?.. లేక సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా? అని మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే.. ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలన్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టమని, ఆయన ప్రాతినిధ్యంవల్లే గజ్వేల్ రూపు రేఖలు మారిపోయాయన్నారు. అందుకే ఆయనను అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి పిలుపిచ్చారు. సిద్దిపేట కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు. అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.