Share News

Siddipet: కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు పొన్నం బృందం

ABN , First Publish Date - 2023-10-25T09:59:14+05:30 IST

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నుంచి కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బృందం బుధవారం ఉదయం బయలుదేరింది.

Siddipet: కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు పొన్నం బృందం

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నుంచి కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బృందం బుధవారం ఉదయం బయలుదేరింది. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను నాణ్యత లోపాలను పరిశీలించేందుకు వెళ్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాలేశ్వరం ద్వారా నీళ్లు వస్తాయని ఆశిస్తున్న హుస్నాబాద్ ప్రజల ఆందోళన ఇప్పటికే 10 ఏళ్ల కాలయాపన జరిగిందని, ఇప్పుడు ప్రాజెక్టు కొంతమేర కుంగి పోయిందన్న ఆందోళనలో హుస్నాబాద్ ప్రాంత రైతాంగం ఉందని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్మీబ్యారేజీ వంతెన కుంగడంపై అధికారులు విచారణ చేపట్టారు. 19, 20, 21 పిల్లర్లు కుంగినట్టు నిర్థారించారు. నిర్మాణ లోపమా?, మరేదైన కారణమా? ఉందా అన్నది అధికారులు తెలుసుకుంటున్నారు. వంతెన కుంగిన విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ కథనాన్ని ఉటంకిస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాన్ని వివరిస్తూ ఆయన లేఖ రాశారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ అంతర్‌ రాష్ట్ర వంతెన శనివారం (21వ తేదీ) రాత్రి కుంగిపోయింది. బ్యారేజీ బీ-బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. అయితే వంతెన కింద ఉన్న బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగడం వల్ల వంతెన కూడా కుంగిందా? లేక బ్యారేజీ గేట్లు, వంతెన మధ్య ఉండే సిమెంట్‌, ఐరన్‌ బీమ్‌ల మధ్య ఏదైనా లోపం వల్ల కుంగిందా? లేక వంతెన స్లాబ్‌ కుంగిపోయిందా? అనేది స్పష్టంగా తెలియడం లేదని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. 20వ నెంబరు పిల్లర్‌ కొద్దిగా కుంగిందని మాత్రం ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 2వ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్‌ 21న దీనిని ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ బ్రిడ్జి పైనుంచే మహారాష్ట్రలోని సిరోంచ జిల్లాకు రాకపోకలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబరు పిల్లర్‌ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వంతెనపై చీకటి ఉండటంతో.. కుంగడం వెనుక కారణాలేంటన్నది అంతు చిక్కకుండా ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శనివారం సాయంత్రం నుంచి 8 గేట్ల ద్వారా 14,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే రాత్రివేళ మహారాష్ట్రకు వెళుతున్న వాహనదారులు వంతెన కుంగిపోయిన విషయాన్ని గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరికొన్ని గేట్లను కూడా ఎత్తి బ్యారేజీలో నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు బ్యారేజీలో నీటిని పూర్తిగా ఖాళీ చేసి, సంబంధిత నిపుణులతో వంతెన కుంగడానికి గల కారణాలను పరిశీలించనున్నట్లు పేర్కొంటున్నారు.

Updated Date - 2023-10-25T09:59:14+05:30 IST