HarishRao: ‘అది అంబేడ్కర్ విగ్రహం కాదు విప్లవ రూపం’

ABN , First Publish Date - 2023-04-14T12:33:15+05:30 IST

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీష్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు.

HarishRao: ‘అది అంబేడ్కర్ విగ్రహం కాదు విప్లవ రూపం’

సిద్దిపేట జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ముందు చూపు వల్ల దేశంలో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నామన్నారు. దళితుల గిరిజనుల కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తెచ్చారని తెలిపారు. అన్ని గురుకుల పాఠశాలలను పదవ తరగతి నుంచి ఇంటర్ మీడియాట్ వరకు పొడిగించారన్నారు. ఈ జాతి అభివృద్ధి కోసం దళితబంధు తెచ్చి కేసీఆర్ (CM KCR) సహోసోపెతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. అంబేడ్కర్ ఓవరసీస్ స్కాలర్ షిప్ ప్రారంభించారని తెలిపారు. విద్య చాలా ముఖ్యమైనదని అందుకే.. వెయ్యికిపైగా గురుకులాలను సీఎం ప్రారంభించారన్నారు.

నేడు దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ప్రారంభిస్తున్నామన్నారు. సచివాలయంలో నుంచి చూస్తే ఒకవైపు అమరవీరుల స్థూపం, మరోవైపు అంబేడ్కర్ విగ్రహం కనబడుతుందన్నారు. అది అంబేడ్కర్ విగ్రహం కాదు విప్లవ రూపమని చెప్పుకొచ్చారు. అంబేడ్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని అన్నారు. ఇంకా దళితులకు జరగవలసినది చాలా ఉందన్నారు. ఆర్థిక సమానత్వం వచ్చినపుడు అస్పృశ్యతను తోలనాడుతామన్నారు. దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం తప్పకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నామన్నారు. దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-14T12:33:15+05:30 IST