Suryapet: ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్...
ABN , First Publish Date - 2023-06-14T16:13:36+05:30 IST
సూర్యాపేట: ఐటీ దాడులపై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులేనని విమర్శించారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు.
సూర్యాపేట: ఐటీ దాడులపై (IT Raids) మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy) కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ (BJP) ప్రేరేపిత దాడులేనని విమర్శించారు. విచారణ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తమ వారంతా తెరిచిన పుస్తకాలేనని, వైట్ పేపర్ వ్యాపారాలే చేస్తున్నారని, పార్టీలోకి రాక ముందే వారికి వ్యాపారాలు ఉన్నాయని మంత్రి అన్నారు. పన్నులు లెక్క ప్రకారమే చెల్లిస్తున్నారని, దాడులకు భయపడేది లేదని, బీజేపీది రాజకీయ కక్షేనని, దాడులతో ప్రజలను, ప్రతిపక్షాన్ని అణచివేయడం అప్రజాస్వామికమని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా తెలంగాణలో బీఆర్‌ఎస్ నేతల (BRS Leaders) ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. ముందుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (MP Kotha Prabhakar Reddy) నివాసాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. కొండాపూర్‌లోని లుంబిని ఎస్‌ఎల్‌ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో ఎంపీ ఉండే ఇంటితో పాటు కార్యాలయాలపైన ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదల ప్రక్రియ కొనసాగుతోంది.
అలాగే యాదాద్రి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (MLA Pailla Shekar Reddy) నివాసం, కంపెనీల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టింది. భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కొత్తపేటలో ఉన్నారు. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే నివాసాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే నివాసంలో ఐటీ అధికారులు సుమారు 30 బృందాలతో ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయపన్ను చెల్లింపు వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఫైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో కీలక డాక్యుమెంట్లను ఐటీ సీజ్ చేసింది. రెండు కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు, ఆస్తుల పాత్రలను ఐటీ సీజ్ చేసింది. రెండు వాహనాల్లో రాజశేఖర్ రెడ్డి ఇంటి నుంచి ఐటీ అధికారులు మరో చోటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇటు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి (MLA Marri Janardhan Reddy) చెందిన షాపింగ్ మాల్‌పై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కేపీహెచ్‌బీ కాలనీలోని జేసీ బ్రదర్స్‌లో ఐటీశాఖ తనిఖీలు చేపట్టింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సోదాలు కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్‌కు సంబంధించి నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, అతని బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.