Komatireddy: రైతులకు సంకెళ్లు వేయడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం
ABN , First Publish Date - 2023-06-13T15:53:41+05:30 IST
రాయగిరి రైతులకు సంకెళ్లు వేయడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ పేరుతో దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు తీసుకోకుండా
యాదాద్రి: రాయగిరి రైతులకు సంకెళ్లు వేయడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిబుల్ ఆర్ రైతులను పోలీసులు భువనగిరి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకు వచ్చారు. అన్నదాతలను పద్నాలుగు రోజులు నల్గొండ జిల్లా జైల్లో ఉంచారు. 14 రోజుల రిమాండ్ అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం
రాయగిరి రైతులకు సంకెళ్లు వేయడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ పేరుతో దళితుల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు తీసుకోకుండా రైతుల ఎకరం, రెండు ఎకరాల భూమిని గుంజుకుంటున్నారు. శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రాయగిరి రైతులకు బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. రైతుల కోసమే చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెప్తారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలి’’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.